సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌కు గోల్డెన్ ఛాన్స్
IND vs ZIM: భారత జట్టు ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది. రెండు రోజుల కిందటే బార్బడొస్ నుంచి స్వదేశానికి చేరుకుంది. ముంబైలో గ్రాండ్‌గా విక్టరీ పరేడ్‌ను నిర్వహించింది. ఇప్పడిప్పుడే ఎలాంటి సిరీస్ లేకపోవడంతో ప్లేయర్లు రెస్ట్ మోడ్‌లోకి వెళ్లారు.
అదే సమయంలో మరో జట్టు జింబాబ్వేతో తలపడబోతోంది. సీనియర్లు ఒక్కరు కూడా లేని టీమ్ ఇది. అందరూ జూనియర్లే ఉన్నారు. ఐపీఎల్‌లో దుమ్ములేపిన బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లను ఈ సిరీస్ కోసం ఎంపిక చేశారు సెలెక్టర్లు. యంగ్ క్రికెటర్లకు ఇదో మంచి అవకాశం.

కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా.. టీ20 ఇంటర్నేషనల్స్‌కు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో వారి స్థానాన్ని భర్తీ చేయడానికి యంగ్ క్రికెటర్లకు ఈ సిరీస్ అద్భుతమైన అవకాశం కల్పించినట్టయింది. ఇందులో సత్తా చాటిన ప్లేయర్లకు టీమిండియా సీనియర్ల జట్టులో రెడ్ కార్పెట్ స్వాగతం లభించడం లాంఛనమే అవుతుంది.
మొత్తం అయిదు టీ20 ఇంటర్నేషనల్స్‌తో కూడిన సిరీస్ ఇది. తొలి మ్యాచ్ ఈ సాయంత్రం 4: 30 గంటలకు ఆరంభమౌతుంది. రాజధాని హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్ దీనికి వేదిక. నాలుగో మ్యాచ్ మినహా మిగిలినవన్నీ కూడా సాయంత్రం 4:30 గంటలకు ఆరంభమౌతాయి. 7, 10, 13, 14 తేదీల్లో మిగిలిన మ్యాచ్‌లు జరుగుతాయి.
జింబాబ్వేతో తొలి రెండు టీ20ల్లో ఆడే జట్టును బీసీసీఐ ఇదివరకే ప్రకటించింది. ఇదివరకు సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రాణాలకు జట్టులో చోటు దక్కలేదు. తాజాగా వారిని కూడా ఇంక్లూడ్ చేసింది బీసీసీఐ. సంజు శాంసన్, శివం దుబే, యశస్వి జైస్వాల్‌ను రీప్లేస్ చేసింది. ఐపీఎల్ స్టార్లను జట్టులోకి తీసుకుంది.
ఈ మ్యాచ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టబోతోన్నాడు. ఓపెనర్‌గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా కేప్టెన్ శుభ్‌మన్ గిల్ వెల్లడించాడు. ప్రీ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు గిల్. అభిషేక్ శర్మతో కలిసి తాను ఇన్నింగ్‌ను ఆరంభిస్తానని పేర్కొన్నాడు.
సాధారణంగా టీ20ల్లో రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్‌ను ఆరంభిస్తుంటాడు. ఈ అవకాశం అభిషేక్ శర్మకు దక్కింది. గైక్వాడ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడని గిల్ చెప్పాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఛరిష్మాను కొనసాగించడం తనకు బిగ్గెస్ట్ ఛాలెంజ్‌గా అభివర్ణించాడు. జట్టులో చాలామంది యంగ్ ప్లేయర్లు ఉన్నారని, వారి భవిష్యత్తుకు ఈ సిరీస్ మంచి అవకాశం కల్పించిందని చెప్పాడు.
తొలి రెండు టీ20లు ఆడే జట్టులో- శుభ్‌మన్ గిల్ (కేప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్షిత్ రాణాలకు చోటు దక్కింది.












Click it and Unblock the Notifications