mohammed shami: షమీ రిటర్న్స్-వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇదే తొలిసారి...!
ఈ ఏడాది ఆరంభంలో పరిమిత ఓవర్ల టోర్నీలకు సిద్ధమవుతున్న టీమిండియాకు శుభవార్త అందింది. టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ తిరిగి వచ్చాడు. గతంలో 2023 వన్డే వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణిస్తున్న సమయంలో గాయంతో జట్టుకు దూరమైన షమీ అప్పటి నుంచి కోలుకుంటున్నాడు. తాజాగా అతను ఫిట్ నెస్ నిరూపించుకోవడంతో ఇంగ్లండ్ తో స్వదేశంలో జరిగే ఐదు టీ20 ల సిరీస్ కు సెలక్టర్లు ఎంపిక చేశారు.
జనవరి 22న కోల్ కతాలో ఇంగ్లండ్ తో భారత్ తమ తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఈ సిరీస్ లో ఆడే జట్టును సెలక్టర్లు తాజాగా ఎంపిక చేశారు. ఇందులో షమీ కాకుండా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడిన నలుగురు ఆటగాళ్లను కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. వీరిలో ఆల్ రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాతో పాటు ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. వీరంతా గతంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడిన రమణ్ దీప్ సింగ్, జితేష్ శర్మ, ఆవేష్ ఖాన్, యష్ దయాళ్ స్ధానంలో జట్టులోకి వచ్చారు.

మరోవైపు ఇంగ్లండ్ తో టీ20లకు ఎంపికైన షమీ విషయానికొస్తే ... గతేడాది నవంబర్ లో దేశవాళీ క్రికెట్‌కు తిరిగి వచ్చినప్పటి నుండి, షమీ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ ఆడిన మొత్తం తొమ్మిది టీ20లు ఆడాడు. ఇందులో 7.85 ఎకానమీ రేటుతో 11 వికెట్లు తీశాడు. తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో బెంగాల్ ఆడిన ఏడు వన్డే మ్యాచ్ లలో మూడింటిని మాత్రమే ఆడాడు. అయితే 25.80 సగటుతో ఐదు వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ కు కూడా షమీని ఎంపిక చేయాలని భావించినా కాలు వాపు తగ్గకపోవడంతో సెలక్టర్లు రిస్క్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండటంతో అతన్ని ఎంపిక చేశారు.












Click it and Unblock the Notifications