రోకో జోడీకి వరల్డ్ కప్ బెర్త్ కన్పార్మ్..!!
వయసైపోయింది.. ఫామ్ లేదు.. జట్టులో కొనసాగడం అనవసరం.. కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు స్టార్ క్రికెటర్లు కోహ్లీ, రోహిత్ శర్మపై వ్యక్తమవుతున్నాయి. రెండేళ్లయ్యింది ఒక్క సెంచరీ అయినా చేశాడా? జట్టులో స్థానం తీసేయాలనే విమర్శలు వస్తున్నాయి. నలభయ్యేళ్లకు చేరువవుతున్న వారిని సాగనంపి జట్టును ప్రక్షాళన చేయాలనే కామెంట్లు వచ్చాయి. కానీ వాటన్నింటిని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ దక్షిణాఫ్రికాపై రోకో జోడీ అద్భుతం చేసింది. తమను విమర్శిస్తున్న వారికి చక్కటి సమాధానం ఇచ్చారు. క్రికెట్ ప్రేక్షకులకు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పరుగుల సునామీ వారిద్దరూ సృష్టించి ప్రేక్షకులకు చక్కటి వినోదం అందించారు.
ప్రేక్షకులకు కడుపు నిండిన వేళ..
రోహిత్ శర్మ వేగవంతమైన అర్థ సెంచరీతో అదరగొడితే.. తన నుంచి అభిమానులతోపాటు సగటు ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడో దాన్ని విరాట్ కోహ్లీ సాధ్యం చేశాడు. వీరిద్దరూ కలిసి గ్రౌండ్ లో పాతుకుపోతే ఎంతటి విధ్వంసం సృష్టిస్తారో మరోసారి నిరూపితమైంది. దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ మైదానంలో చెలరేగి ఆడారు. గ్రౌండ్ లో వీరిద్దరి భాగస్వామ్యం చూసేందుకు రెండు కళ్లు చాలవు. హిట్ మ్యాన్ భారీ షాట్లు.. కోహ్లీ చిరుతలా పరిగెత్తడం చూసి చాలా రోజులైంది. 109 బంతుల్లో 136 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేయడంతో ఎప్పటి నుంచో దీని కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు కడుపు నిండింది. క్రికెట్ ఆటలోని అసలైన మజా నిన్న కనిపించింది.

బద్దలైన రికార్డులు
రో-కో ఆటకు రికార్డులు బద్దలయ్యాయి. షాహిద్ అఫ్రిదిని పక్కకు నెట్టి 352 సిక్స్ లతో అత్యధిక సిక్సర్ల వీరుడిగా రోహిత్ శర్మ నిలవగా.. కోహ్లీలో వన్డేలో 52వ శతకాన్ని నమోదు చేశాడు. తన గురువు ధోని స్వస్థలంతోపాటు తనకు ఇష్టమైన రాంచీలో కోహ్లీ స్వేచ్ఛగా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి ఆడాడు. 11 ఫోర్లు, 7 సిక్సర్లతో రన్ మెషీన్‌గా పేరు పొంది సచిన్ కు వారసుడిగా కోహ్లీ సెంచరీలు నమోదు చేస్తున్నాడు. ఇప్పటికే వన్డేల్లో సచిన్ సెంచరీల రికార్డును అధిగమించిన విషయం తెలిసిందే. బలవంతంగా రిటైర్మ్ మెంట్ తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్న వారందరికీ రోకో జోడీ గట్టి సమాధానం ఇచ్చింది.
ఇప్పటికే కోహ్లీని టెస్టుల్లోకి మళ్లీ తీసుకోవాలని బీసీసీఐ ఆలోచనలు చేస్తున్న వేళ.. కోహ్లీ వన్డేలో చెలరేగి ఆడడం విశేషం. వన్డేలకు వీడ్కోలు పలకాలని కొద్దిమంది చేస్తున్న ప్రచారానికి హిట్ మ్యాన్ తన బ్యాట్ తో బదులిచ్చాడు. వన్డేలో మా శకం ముగియలేదని రోకో జోడీ చాటి చెప్పింది. వన్డే ప్రపంచకప్ వరకు తాము కొనసాగుతామని ఈ ప్రదర్శన ద్వారా కోహ్లీ, రోహిత్ చెప్పకనే చెప్పారు. తగ్గేదే లే అంటూ వీరిద్దరూ చేసిన ప్రదర్శన రాయ్ పూర్ లో జరగనున్న రెండో మ్యాచ్ లో కూడా కొనసాగాలని వారి అభిమానులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications