లయన్స్ ఈజ్ బ్యాక్
ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే మూడు మ్యాచ్ ల వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా అందుబాటులోకి వచ్చారు. ఫిట్‌నెస్ పరీక్షల్లో విజయం సాధించారు. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే నేరుగా జట్టుతో చేరనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు ధృవీకరించాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే వన్డే సిరీస్ మరింత రసవత్తరంగా మారినట్టయింది.
హార్దిక్, రోహిత్ ఇద్దరూ ఆఫ్ఘనిస్తాన్ తో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని, వందశాతం ఫిట్‌నెస్ సాధించారని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇద్దరూ కూడా త్వరలోనే జట్టుతో కలుస్తారని, మొదటి మ్యాచ్ నాటికి జట్టుకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఐపీఎల్ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా గాయపడ్డారు.

రోహిత్ శర్మ హ్యామ్‌స్ట్రింగ్ సమస్యతో ఇబ్బంది పడుతుండగా, స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఐపీఎల్ ముగింపు దశలో ఈ గాయాల కారణంగానే వారు మైదానానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. జట్టుతో ఉన్నప్పటికీ మ్యాచ్ లను ఆడని విషయం తెలిసిందే. సీజన్ ముగిసిన అనంతరం బెంగళూరులో గల బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో రిహాబిలిటేషన్ కు అటెండ్ అయ్యారు. తాజాగా ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొందారు.
మరోపక్క.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో గాయపడిన విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌కు దూరమయ్యారు. అతని గాయంపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించారు. కోహ్లీకి గాయమై వారం రోజులు కూడా కాలేదని, దీనిపై ఇంకా స్పష్టమైన అంచనాలు లేవని పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్ నాటికి అతను కోలుకునే అవకాశం ఉందని భావించినప్పటికీ.. అది ఫిజియో ఇచ్చే నివేదికపైనే ఆధారపడి ఉందని చెప్పారు.
విరాట్ కోహ్లీ స్థానంలో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను వన్డే జట్టులోకి తీసుకున్నారు. ఈ నెల 13న ధర్మశాలలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మొదటి మ్యాచ్ ఆరంభమౌతుంది. రెండో వన్డే 17న లక్నోలో, చివరి వన్డే 20న చెన్నైలో జరగనున్నాయి.
భారత వన్డే జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.












Click it and Unblock the Notifications