చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగ రాయాలన్నా మేమేరా బ్లడీ ఫూల్
Abhishek Sharma: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎదుర్కొంటోన్న వరుస పరాయజాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. బిగ్ బ్యాంగ్‌తో కమ్ బ్యాక్ అయింది ఆరెంజ్ ఆర్మీ. పంజాబ్ కింగ్స్‌పై స్వైర విహారం చేసింది. కొండంత స్కోర్‌ను ఐస్‌క్రీమ్‌లా కరిగించి పడేసింది. ఈ నెల 17వ తేదీన తరువాతి మ్యాచ్ ఆడబోతోంది. ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టనుంది.
ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లను ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది రెండో విజయం. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించిన తరువాత ఇప్పుడు మళ్లీ ట్రాక్ ఎక్కింది. ఈ మధ్యలో నాలుగింట్లో పరాజయాన్ని చవి చూసింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది.

ఉప్పల్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్.. దుమ్ము రేపింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 245 పరుగులు పిండుకుంది. శ్రేయస్ అయ్యర్ కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. 36 బంతుల్లో ఆరు భారీ సిక్సర్లు, ఆరు బుల్లెట్ల వంటి ఫోర్లతో 82 పరుగులు చేశాడు.
ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య- 36, ప్రభ్‌సిమ్రన్ సింగ్- 42, మిడిలార్డర్‌లో నెహల్ వధేరా- 27 సత్తా చాటారు. ఇన్నింగ్ చిట్టచివరి ఓవర్‌లో మార్కస్ స్టొయినిస్ సునామీలా విరుచుకుపడటంతో పంజాబ్ కింగ్స్‌కు అదనపు పరుగులొచ్చాయి. మహ్మద్ షమీ వేసిన 20వ ఓవర్ చివరి నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచాడు స్టొయినిస్.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తెగించి ఆడింది. చావో రేవో అన్నట్లుగా చెలరేగారు బ్యాటర్లు. తొలి ఓవర్ నుంచే బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. 245 పరుగులను ఇంకా తొమ్మిది బంతులు మిగిలివుండగానే కొట్టిపడేశారంటే వాళ్ల బ్యాటింగ్ విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ట్రావిస్ హెడ్ 66 పరుగులతో దూకుడుగా ఆడగా..మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 55 బంతుల్లోనే 141 పరుగులు కొట్టాడు. ఈ క్రమంలో ఏకంగా 10 సిక్సర్లు బాదాడు అభిషేక్. మరో 14 బౌండరీలు అతని బ్యాట్ నుంచి జాలువారాయి. ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగి 17వ ఓవర్ వరకు ఆడిన బ్యాటర్లల్లో 256.36 స్ట్రైక్ రేట్‌ను మెయింటెయిన్ చేశాడు.
245 పరుగుల స్కోర్‌ను ఛేదించడం ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ సరికొత్త రికార్డును నెలకొల్పినట్టయింది. మొత్తం ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో హయ్యెస్ట్ రన్ ఛేజ్. ఐపీఎల్‌లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లన్నింట్లోనూ ఈ స్థాయిలో రన్ ఛేజ్ చేయడం ఇది రెండోసారి మాత్రమే. ఐపీఎల్‌లో అత్యధికంగా 287 పరుగులు చేసి చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. ఇప్పుడు ఆ స్థాయిలో స్కోర్ చేజ్ చేసి ఆ చరిత్రను తిరగరాసింది.

తొలి హయ్యెస్ట్ రన్ ఛేజ్ పంజాబ్ కింగ్స్ పేరు మీద ఉంది. 2024 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ నిర్దేశించిన 261 పరుగులను అందుకుంది పంజాబ్. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్- 75, సునీల్ నరైన్- 71, వెంకటేష్ అయ్యర్- 39, రస్సెల్- 24, శ్రేయాస్ అయ్యర్- 28 పరుగులు చేశారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్.. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి దీన్ని అందుకుంది. ఆ మ్యాచ్‌లో జానీ బెయిర్‌స్టో సెంచరీతో చెలరేగాడు. 108 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ప్రభ్‌సిమ్రన్ సింగ్- 54, రిలీ రొస్సొ- 26, శశాంక్ సింగ్- 68 పరుగులతో రాణించారు అప్పట్లో.












Click it and Unblock the Notifications