సెమీస్‌లో భారత్ ప్రత్యర్థి ఎవరో తేలింది: నాకౌట్ మ్యాచ్‌లల్లో ఇప్పటిదాకా టీమిండియా గెలిచింది లేదు
ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023లో ముగింపు దశకు వచ్చేసింది. గ్రూప్స్ దశలో ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలివుంది. న్యూజిలాండ్, శ్రీలంక మినహా అన్ని జట్లూ ఒకటి చొప్పున మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో నేడు దక్షిణాఫ్రికా- ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
ఈ నెల 12వ తేదీన భారత జట్టు తన చివరి గ్రూప్ మ్యాచ్ ఆడబోతోంది. నెదర్లాండ్స్‌తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దీనికి వేదిక. ఈ వరల్డ్ కప్‌లో అదే చిట్టచివరిది. దీని తరువాత సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయ్యాయి. 15, 16 తేదీల్లో రెండు సెమీ ఫైనల్స్ ముగుస్తాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్.

గ్రూప్ దశలో ఎట్టకేలకు న్యూజిలాండ్ గెలుపు రుచి చూసింది. బెంగళూరులో శ్రీలంకను అయిదు వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లల్లో 171 పరుగులకు ఆలౌట్ కాగా.. ఈ లక్ష్యాన్ని 23.2 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి ఛేదించారు బ్లాక్ క్యాప్స్.
ఈ విజయంతో తన సెమీ ఫైనల్స్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఇప్పటివరకు సెమీస్ చేరిన భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా సరసన చేరినట్టయింది. ఇది అధికారికం కాదు. ఇంగ్లాండ్‌పై జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి తీరుపై ఇది ఆధారపడి ఉంది. భారీ తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించగలిగితేనే పాకిస్తాన్‌కు సెమీ ఫైనల్స్ అవకాశాలు ఉంటాయి.
తొలుత పాకిస్తాన్ బ్యాటింగ్‌కు దిగితే 300 పరుగులు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఇంగ్లాండ్‌ను 13 పరుగులకే ఆలౌట్ చేయాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగి 300 పరుగులు చేస్తే.. ఆ లక్ష్యాన్ని పాకిస్తాన్ ఆరు ఓవర్లలోనే కొట్టాల్సి ఉంటుంది. అలా జరిగితేనే పాకిస్తాన్ నెట్ రన్‌రేట్ మెరుగుపడుతుంది. అది సాధ్యం అయ్యే పని కాదు. దీన్ని బట్టి చూస్తే- న్యూజిలాండ్ సెమీ ఫైనల్స్ స్థానం ఖరారైనట్టే.
తొలి సెమీస్‌లో భారత్‌తో తలపడే జట్టు న్యూజిలాండే అవుతుంది. ఈ నెల 15వ తేదీన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. విశేషం ఏమిటంటే- ఇలాంటి నాకౌట్ మ్యాచ్‌లల్లో భారత జట్టుపై న్యూజిలాండ్‌దే పూర్తి ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. అదే ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్స్ వరల్డ్ కప్ టోర్నమెంట్ నాకౌట్స్‌లల్లో భారత్‌పై వరుసగా గెలుస్తూ వస్తోంది కివీస్. 2016 నుంచి ఐసీసీ నాకౌట్స్‌లల్లో న్యూజిలాండ్ చేతుల్లో భారత్ ఓడిపోతూనే ఉంది. 2016 నుంచి వరుసగా అయిదుసార్లు న్యూజిలాండ్‌తో తలపడగా అన్నింట్లో పరాజయమే పలకరించింది.
2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌లో ఇదే న్యూజిలాండ్ చేతిలో ఓడింది భారత్. 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లోనూ విజయం ఆ జట్టునే వరించింది. అదే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో కూడా కివీస్ చేతిలో ఓడింది భారత్. ఇప్పుడదే సీన్ రిపీట్ అవ్వొచ్చనే ఆందోళన అభిమానుల్లో నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications