హుటాహుటిన ఆసుపత్రిలో అడ్మిట్ అయిన టీమిండియా స్టార్ బ్యాటర్
భారత జట్టు స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఫలితంగా అతను ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. తీవ్రమైక కడుపునొప్పితో అతను బాధపడుతున్నాడు. గ్యాస్ట్రోఎంటెరిటిస్ నిర్ధారణ అయింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా పుణేలో రాజస్థాన్ తో మ్యాచ్ ముగిసిన అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు యశస్వి జైస్వాల్.
మ్యాచ్‌లోనూ జైస్వాల్ ఇబ్బందిపడ్డాడు. రాజస్థాన్ పై 15 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్ లో ముంబై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 216 పరుగులు చేయగా.. 18.1 ఓవర్లలోనే దీన్ని అందుకుంది ముంబై. ఏడు వికెట్ల నష్టానికి 217 పరుగుల చేసింది. అజింక్య రహానె- 72, సర్ఫరాజ్ ఖాన్- 73 పరుగులతో సత్తా చాటారు. చివర్లో అధర్వ అంకొలేకర్ 9 బంతుల్లో 26 పరుగులతో మెరుపు ఇన్నింగ్ ఆడాడు.

మ్యాచ్ అనంతరం నొప్పి తీవ్రం కావడంతో హుటాహుటిన యశస్వి జైస్వాల్ ను పుణేలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రికి తరలించారు. నొప్పి అధికంగా ఉండటంతో ఐవీ డ్రిప్స్ ఇచ్చారు డాక్టర్లు. స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించారు. గ్యాస్ట్రోఎంటెరిటిస్ గా తేల్చారు. పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సూచించారు. జైస్వాల్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ఇంకా అధికారిక అప్‌డేట్ ఇవ్వలేదు. ఇంకాస్సేపట్లో దీనికి సంబంధించిన సమాచారం బీసీసీఐ నుంచి వెలువడే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచినప్పటికీ ఉపయోగం లేదు. వరుస ఓటములతో ఈ టోర్నమెంట్ నుండి ఆ జట్టు ఇదివరకే నిష్క్రమించింది కూడా. జనవరి మధ్యలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ వరకు ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లు ప్రస్తుతం లేవు. దీంతో అతనికి విశ్రాంతి తీసుకోవడానికి తగినంత సమయం లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో రాణిస్తోన్నాడు జైస్వాల్. హర్యానాపై 50 బంతుల్లో 101 పరుగులు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications