Home

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ. తనను నమ్ముకున్నవారు ఎన్ని తప్పులు చేసినా, సమర్ధించుకుంటూ వారిని కలుపుకుని పోవడం ఆయనలో ఉన్న విశిష్ట నాయకత్వ లక్షణం. ఆయననే నమ్ముకుని ఉన్నవారు ఇన్నేళ్ళుగా వెనుకబడిపోయినా ఇప్పుడు వారికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆయన వ్యక్తిగత సహాయకుడు సూరీడు మొదలుకుని ఆయన సన్నిహితులందరూ దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ధోరణితో చకచకా పనులు చేసుకుపోతున్నారు. ఔటర్‌రింగ్‌ రోడ్‌ లబ్దిదారుల వైనం నీటి ఉపరితలంపై కనిపిస్తున్న మంచుగడ్డ మాత్రమే. నీటిలోపల మంచు పర్వతమే ఉండే అవకాశాలున్నాయి. మొండిగా తనవారిని వెనకే సుకువచ్చే ముఖ్యమంత్రి ధోరణే దీర్ఘకాలంలో ఆయనను దెబ్బతీస్తుందని కాంగ్రెస్‌ వృద్ధ నాయకులు అంటున్నారు. ఇప్పటికే వివిధ ఆరోపణల కారణంగా అధిష్టానవర్గం వద్ద పలుచబడిన రాజశేఖరరెడ్డి ప్రతిష్ట రానున్న కాలంలో అనేక పరీక్షలకు లోను కానుంది.

కరీంనగర్‌ లోక్‌సభ ఉప ఎన్నిక రాజశేఖరరెడ్డికి అగ్నిపరీక్ష కానుంది. అక్కడ ఒకవేళ కాంగ్రెస్‌ ఓడిపోతే ఆయన అధిష్టానవర్గం వద్ద తలెత్తుకునే పరిస్ధితి ఉండదు. అధికార బలం కూడా తోడు కావడంతో అక్కడ కాంగ్రెస్‌ గెలిచినా వైఎస్‌ సమస్యలు అక్కడితో తీరిపోయే అవకాశం లేదు. త్వరలో జరుగనున్న మంత్రివర్గ విస్తరణ తర్వాత చెలరేగే అసమ్మతిని ఆయన తట్టుకోవలసి ఉంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్‌ పార్టీలో అందరూ పెద్ద నాయకులే. మంత్రి పదవులను ఆశిస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య అధికంగానే ఉంది. ఓ పది పదిహేను మందికి మంత్రి పదవులు ఇచ్చి చేతులు దులుపుకున్న తర్వాత ఓ యాభైమంది ఎమ్మెల్యేల వరకు అసమ్మతి శిబిరంలోకి వెళ్ళిపోయే అవకాశముంది. సరిగ్గా అదే సమయంలో ఔటర్‌రింగ్‌ రోడ్‌ అక్రమాలపై టిడిపి హైకోర్టులో దాఖలు చేసిన కేసు విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. గతంలో ఎన్టీఆర్‌ అక్రమాలపై కోర్టులో కేసు వేసి, పది ఆరోపణలకు ప్రాధమిక సాక్ష్యాధారాలను నిరూపించిన ఘనాపాటీ న్యాయవాది ఎస్‌ రామచంద్రరావు టిడిపి తరఫున వాదిస్తున్నందువల్ల ఈ కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

నల్గొండలో ఎలిమినేటి మాధవరెడ్డి నీటిపారుదల ప్రాజెక్టు మొదటి దశ పూర్తి కావడం, దానిని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి నేడు జాతికి అంకితం చేయడం ఆయన కీర్తిని ఇనుమడింపచేయవచ్చు. నీటిపారుదల ప్రాజెక్టులను ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తలపెట్టిన వాటిని ప్రాధాన్యక్రమంలో పూర్తి చేయడం వైఎస్‌ ప్రకటిత లక్ష్యాల్లో ప్రముఖమైనది. ఈ ప్రాజెక్టును పూర్తి చేశానని ఆయన సగర్వంగా సోనియాగాంధీకి చెప్పుకునే అవకాశం దొరికింది. రానున్న రెండేళ్ళు వైఎస్‌ మనుగడకు ఎంతో ముఖ్యమైనవి. అధిష్టానం ఆశీస్సులు ఉన్నంతవరకు వైఎస్‌ పీఠం కిందికి నీళ్ళు వచ్చే అవకాశం లేదు. అయితే ఇప్పటి వరకు అనుభవించిన స్వేచ్ఛ ఆయనకు ఉండదు. మంత్రివర్గ విస్తరణ మొదలుకుని మిగితా ముఖ్యమైన అన్ని విషయాల్లో అధిష్టానవర్గం తలదూర్చే అవకాశముంది. ప్రభుత్వ ఉద్యోగులను దువ్వుకుంటూ పోవడం వైఎస్‌కు తదుపరి టెర్మ్‌ కోసం ఉపయోగపడవచ్చు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X