బంగాళాఖాతంపై ద్రోణి- ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు: ఉపశమనం
ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీస్తోన్నాయి. మరింత ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి.
ఈ పరిస్థితుల మధ్య తీపికబురు అందింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నేటి నుంచి సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఆది, సోమవారాల్లో కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గి ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాతావరణం కొంత చల్లగా మారుతుందని, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

శుక్రవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అనేక జిల్లాల్లో ఈదురుగాలులు వీచాయి. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపించింది. దాదాపుగా ఆయా రీజియన్లల్లోని అన్ని జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడ్డాయి. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచాయి. ఫలితంగా ఎండ వేడి నుంచి కొంత ఉపశమనం లభించింది.
నేడు కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది. ద్రోణి ప్రభావంతో నేడు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. వీటితో పాటు రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తుందని విపత్తు నిర్వహణ సంస్థ వివరించింది. ఆయా జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ చెప్పారు.
అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండటం వల్ల పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. కాగా శనివారం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, విజయనగరం- 8, పార్వతీపురం మన్యం- 10, పోలవరం- 2, ఎన్టీఆర్- 1, గుంటూరు- 1, పల్నాడు- 19, మార్కాపురం- 6, ప్రకాశం- 10, నెల్లూరు- 3, తిరుపతి- 4 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ చెప్పారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications