వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖంగుతిన్న వైఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews
Y S Rహైదరాబాద్‌: దేవాదాయ శాఖ భూముల అమ్మకం కుంభకోణం పర్యవసానంగా ఆ శాఖ మంత్రి ఎం.సత్యనారాయణ రావు రాజీనామా చేయడం ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిని ఖంగు తినిపించింది. ఎమ్మెస్‌ రాజీనామా లేఖ పంపినప్పుడు విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్న వైఎస్‌ వెంటనే సమావేశం ముగించి ఏకాంత మందిరంలోకి వెళ్ళి, ఎమ్మెస్‌ రాజీనామాపై సన్నిహితులతో చర్చలు జరిపారు.

ఎం.సత్యనారాయణ రావుకు ఎంతో కొంత నిజాయితీ పరుడని పేరుంది. దేవుడి భూముల జోలికైతే ఆయన వెళ్ళడానికి సాహసం చేసే రకం కాదు. దేవుడి సొమ్ము తిన్నవారు బాగుపడరని, కానీ తన శాఖ ఉద్యోగులకు ఆ భయం లేకుండా పోయిందని అనేక సందర్భాల్లో ఎమ్మెస్‌ వ్యాఖ్యానించారు. మరి మంత్రికి తెలియకుండా మంత్రాంగం ఎలా జరిగింది? దీనివెనుక ముఖ్యమంత్రి పేషీలోని అధికారులు, ఒక సలహాదారుడు కీలకపాత్ర వహించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ముఖ్యమంత్రి కోటరీ కలిసి మంత్రిని డమ్మీని చేసి ఈ అవకతవకలు చేయగలిగారని తెలుస్తోంది. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి మూర్తిపై విజిలెన్స్‌ నివేదికలు అందినా ఆయనను సస్పెండ్‌ చేయకుండా హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడం సిఎం కోటరీకి ఆయన మీద ఉన్న అవ్యాజ ప్రేమాభిమానాలకు నిదర్శనం.

మంత్రి అమాయకుడు. దేవాదాయ కమిషనర్‌ వెంకటేశ్వర్లు అస్మదీయుడు. ఇంకేం అప్పటి రెవిన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మూర్తికి ఆడది ఆట పాడింది పాట అయింది. కొద్ది నెలల్లో రిటైరవుతున్న నేపధ్యంలో వెంకటేశ్వర్లు నాలుగుతరాలకు సరిపడా వెనకేసుకోడానికి ఇదే అదను అని భావించాడు. అందుకు బాస్‌ మూర్తి బాసట ఉంది. దీనిపై రిటైర్డు న్యాయమూర్తితో విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించడం కంటి తుడుపే.

ఒక్క దేవాదాయ శాఖలోనే తన కోటరీ మాయాజాలంతో ఇంత పెద్ద కుంభకోణం జరిగిందంటే, ఇతర పెద్ద శాఖల్లో ఏం జరుగుతోంది? వీళ్ళను ఇలాగే వదిలేస్తే ఇంకా ఎంత పెద్ద కుంభకోణాలు బయటికి వస్తాయో? దేవాదాయ శాఖ కుంభకోణంపై ఇప్పటికే అధిష్టానవర్గం ఆరా తీస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అస్ధిరతకు, అవినీతికి, అసమర్ధతకు మారు పేర్లన్న నానుడిని నిజం చేస్తూ ఇటువంటి కుంభకోణాలు జరగడం వైఎస్‌ ప్రభుత్వ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X