కాంగ్రెస్ ను ఉంచుతారా? ముంచుతారా?

ఎన్నికల ప్రచారంలో తారల తళుకు బెళుకులు, ఇతర నాయకుల పక్క వాద్యాలు లేకుండా వైఎస్ ఒంటి చేత్తో ప్రచారాన్ని సాగిస్తున్నారు. జీవిత, రాజశేఖర్ లు కూడా తమంతట తాము ప్రచార రథమెక్కారు కానీ వైఎస్ కోరలేదు. జయసుధను అమె ఎన్నిక ఏప్రిల్ 16న ముగిసిన తర్వాత ఆంధ్రాలో ప్రచారబరిలోకి దింపి మహిళా ఓటర్లను ఆకర్షించవచ్చు కానీ వైఎస్ ఆ విషయంలో కూడా చొరవ తీసుకున్నట్టు కన్పించడం లేదు.
తన ఐదేళ్ళ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అందవలసిన వన్నీ అందాయని ఆయన విశ్వాసం. వృద్ధాప్యపుపించన్లు, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ళు, చౌక బియ్యం, పావలా వడ్డీకి రుణాలు వంటి పథకాలు ప్రజలను బాగా ప్రభావితం చేసినట్టే కన్పిస్తోంది. అభ్యర్ధుల శక్తి సామర్ధ్యాలకు (90)శాతం అభ్యర్ధులు వైఎస్ మనుషులే అనుకోండి) తోడు తాను అమలు చేస్తున్న పథకాలు తనను గట్టెక్కించి మరోసారి ముఖ్యమంత్రిగా నిలబెడతాయని వైఎస్ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.
చంద్రబాబుకు ఉన్నన్ని హంగులు ఈసారి వైఎస్ కు లేవు. గత ఎన్నికల్లో తనతో పాటు ఉన్న టీఅర్ ఎస్, వామపక్షాలు ఇప్పుడు తెలుగుదేశంతో జత కట్టాయి. మహాకూటమికి జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణల స్టార్ అట్రాక్షన్ ఉంది. నగదు బదిలీ పథకం, ఉచిత కలర్ టీవీ, ఉచిత బియ్యం మహాకూటమికి కలిసొచ్చే వాగ్దానాలు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి అభిమానుల బలం, చిరు, పవన్ ల ఆకర్షణ శక్తి, సంఖ్యాధిక్యత గల ఒక కులం అండ ఉన్నాయి. ఆకర్షణీయమైన మేనిఫెస్టో ఉంది.
కానీ వైఎస్ కొత్తగా ప్రజలకు హామీలు ఇవ్వడం లేదు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపాం కాబట్టి, విశ్వసనీయతకు ఓటేయండని ఆయన ప్రజలను అడుగుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంకా మొదటి స్ధానంలో ఉందని ఇరవైకి పైగా లోక్ సభ స్ధానాలు కాంగ్రెస్ కు వస్తాయని ఇండియాటుడే, ఎన్డీటీవీ సర్వేలను బట్టి తెలుస్తోంది.
వైఎస్ మొండితనం, విశ్వాసం వల్ల కాంగ్రెస్ మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అది ఇందిరా కాంగ్రెస్ లా కాకుండా వైఎస్ కాంగ్రెస్ గా మారిపోతుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే వైఎస్ డైబ్బై దాటిన వృద్ధ కాంగ్రెస్ నాయకుల పంచెలూడదీసి కూర్చోబెట్టారు. పార్టీలో తనకు ప్రత్యర్ధి వర్గమంటూ లేకుండా చేసుకోగలిగారు. ఇందిరాగాంధీ హయాంలో ఇలా ముఖ్యమంత్రులు బలపడడాన్ని సహించేవారు కాదు. ఇప్పుడు సోనియాగాంధీ పొలిటికల్ నాలెడ్జ్జి అంతంత మాత్రం కాబట్టి ఏఐసిసిలోని సీనియర్ నాయకులు చెప్పినట్టి ఆమె నడుచుకుంటున్నారు. ఏమైనప్పటికీ వైఎస్ కాంగ్రెస్ ను ఒంటి చేత్తో గెలిపించి చరిత్ర సృష్టించాలనుకుంటున్నారు. ఈ ప్రయోగం గనుక విఫలమైతే రాష్ట్రంలో కాంగ్రెస్ చరిత్ర గర్భంలో కలిసిపోయినట్టే. తమిళనాడులో లాగా తెలుగుదేశం, ప్రజారాజ్యం వంటి ప్రాంతీయ పార్టీలే ఒకరి తర్వాత ఒకరు రొటేషన్ లో అధికారంలోకి వచ్చే అవకాశాలుంటాయి.












Click it and Unblock the Notifications