వైయస్ జగన్ మంకుపట్టు

కడప జిల్లా పరిషత్ సమావేశాన్ని జడ్పీటిసి సభ్యులు అడ్డుకోవడం, వారికి మద్దతుగా జిల్లా కాంగ్రెసు శాసనభ్యులు ధర్నాకు దిగడం, ఆ ధర్నాలో జగన్ చిన్నాయన వైయస్ వివేకానంద రెడ్డి కూడా పాల్గొనడం జగన్ ఉద్దేశాన్ని బయటపెడుతున్నాయి. వివేకానంద రెడ్డి కూడా రోడ్డుకెక్కడాన్ని బట్టి జగన్ ప్రమేయం అసమ్మతి కార్యకలాపాల్లో ఉందనే విషయం బయటపడుతోందని చెబుతున్నారు. కొండా సురేఖ వంటి మంత్రులు, టి. రాజయ్య వంటి శాసనసభ్యులు రోశయ్యకు ఎదురు తిరగడానికి సిద్ధపడినట్లే కనిపిస్తున్నారు. సిఎల్పీ సమావేశం నిర్వహిస్తే తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరికలు కూడా చేస్తున్నారు.
తనను ముఖ్యమంత్రిగా చేయాలనే ఆందోళనల్లో తన ప్రమేయం లేదని చెప్పుకోవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. ఆవి స్వచ్ఛందంగా జరుగుతున్నవేననే అభిప్రాయాన్ని పార్టీ అధిష్ఠానానికి కల్పించే ప్రయత్నం కూడా ఇందులో ఇమిడి ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి రోశయ్య హెచ్చరికలను కూడా మంత్రులు, శాసనసభ్యులు ఖాతరు చేయడం లేదు. తనను అధిష్ఠానం ముఖ్యమంత్రిగా నియమించిందని, మంత్రులు, పార్టీ శాసనసభ్యులు ఇష్టం ఉంటే తనతో కలిసి పనిచేయాలని, లేదంటే రాజీనామాలు చేయవచ్చునని ఆయన అన్నారు. తాజా ఆందోళనకరమైన పరిస్థితిపై రోశయ్య సోనియాకు లేఖ కూడా రాశారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు.
మూడు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తర్వాతనైనా తనను ముఖ్యమంత్రిగా నియమిస్తారనే ఆశతో ఉన్న వైయస్ జగన్ తలవంచినట్లు కనిపించారని, అయితే ఆ ఆశ వమ్ము కావడంతో తిరగబడడమే మంచిదని నిర్ణయించుకున్నారని అంటున్నారు. నిజానికి, ఆయన అక్టోబర్ 2వ తేదీన కడపలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అందుకు ఆయన సిద్ధంగా లేరని చెబుతున్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా బెంగుళూరులోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాడోపేడో తేల్చుకోవడానికి జగన్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications