బొత్సపై రెడ్డి నేతల ఆగ్రహం

తాను ముఖ్యమంత్రిని కావాలని అనుకుంటున్నానని పదే పదే బొత్స అనడం ముఖ్యమంత్రి అధికారాన్ని తక్కువ చేసేదిగా ఉందని రెడ్డి నాయకులు అన్నట్లు తెలుస్తోంది. రెడ్లంతా వైయస్సార్ కాంగ్రెసులోకి వెళ్తారనేది తప్పుడు ప్రచారమని వారంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంచనాల మేరకు ప్రభావం చూపలేకపోతున్నారని కాంగ్రెసు అధిష్టానం అంగీకరిస్తున్నప్పటికీ ఆయ నను తప్పిస్తారనే అభిప్రాయం బలపడకూడదనే ఉద్దేశంతో ఉంది.
రెడ్ల తిరుగుబాటుతో పార్టీలో రెడ్ల ఆధిపత్యాన్ని తగ్గించడానికి ఇందిరా గాంధీ ప్రయత్నించినప్పుడు కూడా విదేయత గల రెడ్లు బయటకు వెళ్లిపోలేదనే విషయాన్ని రెడ్డి నాయకులు గుర్తు చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పట్ల అసంతృప్తిగా ఉన్న రెడ్లు కూడా తాను ముఖ్యమంత్రిని కావాలని అనుకుంటున్నానని బొత్స చేస్తున్న వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రిని మరింత బలహీనపరుస్తాయని, దానివల్ల పార్టీ నష్టపోతుందని వారంటున్నారు. మంత్రివర్గంలో రెడ్ల ప్రాతినిధ్యాన్ని తగ్గించాలనే పార్టీ అధిష్టానం ఆలోచన పట్ల ఇప్పటికే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఓ రెడ్డి శాసనసభ్యుడు కోరినప్పుడు ఇప్పటికే రెడ్లు మంత్రివర్గంలో చాలా ఉన్నారని, కొత్తగా రెడ్లకు ప్రాతినిధ్యం ఉండదని ఆజాద్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications