అధిష్టానం ఆశీస్సులు, రెచ్చిపోతున్న కిరణ్

కిరణ్ కుమార్ రెడ్డికి కాంగ్రెసు అధిష్టానం నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని, అందుకే ఆయన దూకుడు ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో ఆయన చొరవ ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన దాదాపు ఏడుగురు శానససభ్యులను వెనక్కి వచ్చేలా చేయగలిగారు. ఇంకా మరి కొంత మంది రావచ్చునని అంటున్నారు. హైకోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ ప్రారంభం అవుతుండడంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డీలా పడిపోయారు. చంద్రబాబు అసలు తమకు పోటీయే కాదన్నట్లుగా కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, చంద్రబాబుతో కొన్ని విషయాల్లో కలిసి పనిచేస్తూ వైయస్ జగన్‌ను, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును, తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ కొట్టడంలో విజయం సాధించారనే అభిప్రాయం కూడా ఉంది.
రైతులకు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రాజీవ్ యువకిరణాలు, రూపాయికి కిలోబియ్యం పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం కూడా కిరణ్ కుమార్ రెడ్డికి కలిసి వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు ఆయన కెసిఆర్‌ను లక్ష్యం చేసుకున్నట్లు చెబుతున్నారు. కెసిఆర్ లోకసభ నియోజకవర్గం మహబూబ్‌నగర్‌లో సభ పెట్టి సవాల్ చేశారు. కెసిఆర్‌ను, తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కుంటాననే దీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోబోమని కూడా అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శానససభ్యులు, తెలంగాణ మంత్రులు కిరణ్ కుమార్ రెడ్డికి సరెండర్ అయ్యారు. పార్లమెంటు సభ్యుల సంగతి అధిష్టానమే తీసుకుంటుంది. ఈ స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి రెచ్చిపోతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications