సోనియాకు వైయస్ జగన్ సవాల్

కాంగ్రెసుకు చెందిన కనీసం 28 మంది శాసనసభ్యులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటారనేది తేలిపోతూనే ఉన్నది. వారు మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం సాంకేతికంగా మైనారిటీలో పడిపోయినట్లే. అయితే, వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు పడే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అదే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి రక్షణగా మారుతుందా అనేది చెప్పలేం. కర్ణాటక అనుభవాన్ని చూసుకుంటే అలాగే అనిపిస్తోంది. అయితే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఈ బలం చాలునని, సాంకేతికపరమైన అడ్డంకులు తొలగించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని జగన్ వర్గం వాదిస్తోంది.
వైయస్ జగన్ వెంట కనిపించేది 28 మంది శాసనసభ్యులే అయినా ఆయన బలం మరింత ఉంటుందని భావించేవాళ్లు కూడా ఉన్నారు. కాంగ్రెసు పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో మూడింట ఒక వంతు శాసనసభ్యుల మద్దతు కూడగట్టుకునే దాకా జగన్ ఆగుతారా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. ప్రభుత్వ మనుగడకు 147 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినట్లే. ప్రభుత్వ మనుగడకు కనీసం ఆరుగురు సభ్యుల మద్దతు అవసరమని భావిస్తున్నారు. ఏమైనా, సోనియాకు వైయస్ జగన్ సవాల్ విసిరారనే అనుకోవచ్చు. ఈ స్థితిలో రాష్ట్రం రాష్ట్రపతి పాలన కిందికి వెళ్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఆందోళనలను సాకుగా చూపి రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా అనేది చెప్పలేం. అయితే, ఇందుకు కేంద్ర ప్రభుత్వం కొంత సమయం తీసుకోవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications