ఈసారి కచ్చితంగా..: తెలంగాణకూ 'జగన్' టానిక్

జగన్ జైలుకు వెళ్లక ముందు పార్టీ హవా కొనసాగింది. ఆయన జైలుకు వెళ్లాక కూడా కొద్ది రోజులు అదే హవా కనిపించింది. జగన్ జైలు నుండి విడుదలవుతారనే విశ్వాసం కారణంగా కొద్దిరోజులు పార్టీలో ఉత్సాహం కనిపించిందని కానీ, సంవత్సరం దాటినా, ఎన్నికలు సమీపిస్తున్నా బెయిల్ రాకపోవడంతో క్యాడర్ క్రమంగా నిరుత్సాహంలో కూరుకుపోయింది. పంచాయతీ ఎన్నికల జోరు కూడా అంతగా కనిపించడం లేదంటున్నారు.
క్యాడర్ నిరుత్సాహాన్ని గుర్తించిన పార్టీ పెద్దలు వారిలో ఉత్సాహం తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ సెప్టెంబరులో జగన్ తప్పకుండా బయటకు వస్తారని నేతలు కిందిస్థాయి నాయకులకు చెబుతున్నారట. అధిష్టానం పెద్దల్లోను ఆ ధీమా కనిపిస్తోంది. సెప్టెంబరులో కచ్చితంగా జగన్‌కు బెయిల్ వస్తుందని, పార్టీని లీడ్ చేస్తారని ముఖ్య నేతలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కిందిస్థాయి నాయకులకు, కార్యకర్తలకు చెప్పి వారిలో ఉత్సాహం పెంపొందించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రతో నడక సాగిస్తోందని, జగన్ బయటకు వచ్చాక ఇద్దరు కలిసి మరింత జోరుగా రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతారని ముఖ్యనేతలు చెబుతున్నారట. అదే సమయంలో తెలంగాణలో పార్టీ అంత బలంగా లేదనే వాదన ఉంది. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిలదొక్కుకుంది. తెలంగాణలో అంత ప్రభావం లేదు. అయితే సెప్టెంబర్‌లో జగన్ బయటకు వచ్చాక తెలంగాణలో పర్యటించి పార్టీని బలోపేతం చేస్తారని తెలంగాణ నేతలకు ధైర్యం చెబుతున్నారట.












Click it and Unblock the Notifications