సుప్రీం వ్యాఖ్యలు: వైయస్ జగన్ చేతిలో అస్త్రం

సుప్రీంకోర్టు వ్యాఖ్యలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తనకు అనుకూలంగా మలుచుకుంటోంది. కేంద్రం తన రాజకీయ ప్రత్యర్థులపై సిబిఐని అస్త్రంగా వాడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చాలా కాలంగా విమర్శిస్తున్నారు. సిబిఐని ప్రయోగించి జగన్‌ను జైలులోకి నెట్టిందని, కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే సిబిఐ దర్యాప్తు జరుగుతోందని వైయస్సార్ కాంగ్రెసు విమర్శిస్తోంది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలతో తమ ఆరోపణలు నిజమని రుజువైందని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు అంటున్నారు.
బొగ్గు కుంభకోణంపై నివేదికను కేంద్ర న్యాయశాఖ మంత్రి ముందు పరిచిన విషయాన్ని సిబిఐ డైరెక్టర్ రంజిత్ సింగ్ కూడా అంగీకరించారు. దాన్ని ఆయన సమర్థించుకున్నారు కూడా. నివేదికను తాము బయటివారికి వెల్లడించలేదని, సిబిఐ స్వయంప్రతిపత్తి సంస్థ కాదని, తాము న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్ నివేదికను చూపించడం తప్పేమీ కాదని ఆయన అన్నారు. దీంతో సిబిఐ దర్యాప్తులో కేంద్రం జోక్యం ఉందనేది తేలిపోయిందని అంటున్నారు.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో కూడా సిబిఐ కేంద్రం సూచనలకు అనుగుణంగానే వ్యవహరిస్తోందనే అభిప్రాయాన్ని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి పనికి వచ్చే అవకాశాలున్నాయి. గతంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ కాంగ్రెసు నాయకత్వంపై చేసిన విమర్శలు కూడా జగన్‌కు కలిసి వచ్చాయి. తన రాజకీయ ప్రత్యర్థులపై కాంగ్రెసు సిబిఐని ప్రయోగిస్తోందనే వాదనను వైయస్సార్ కాంగ్రెసు మరింత ముందుకు తీుసుకుని వెళ్లే అవకాశాలున్నాయి.
తమ రాజకీయ వ్యూహానికి అనుగుణంగానే జగన్‌కు చెందిన సాక్షి దినపత్రిక సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై సవివరమైన వార్తాకథనాన్ని ప్రచురించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలుచుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజకీయంగా ప్రయోజనం పొందే వ్యూహానికి శ్రీకారం చుట్టినట్లే.












Click it and Unblock the Notifications