కొత్త అప్పు తేవాల్సిందే: ఏపీకి రూ.90వేల కోట్లు భారం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అప్పులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉద్యోగుల వేతన సవరణ, రుణ మాఫీ, పింఛన్లు, రాయితీలు చాలా భారంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాత అప్పు తీర్చడానికి కొత్త రుణానికి వెళ్తోంది. దీంతో మొత్తం రుణ భారం రూ.90వేల కోట్లకు చేరనుంది.
పెరుగుతున్న ఖర్చులకు సరిపడా నిధులను సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి అప్పుల సేకరణకు వెళ్తుంది. విభజన నాటికి ఉమ్మడి ఏపీకి రూ.1.15 లక్షల కోట్ల అప్పు ఉంది. అందులో జనాభా ప్రాతిపదికన ఏపీకి 58.32 శాతం లెక్కన రూ.67,441 కోట్ల అప్పు బదిలీ అయింది.
విభజన తరువాత తొలి ఏడాది ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి మరో రూ.11 వేల కోట్ల రుణం సేకరించింది. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రుణభారం రూ.78,441 కోట్లకు చేరింది. గత గత పదేళ్లలో చేసిన రుణాలు, వాటిపై వడ్డీ చెల్లింపులకే ఈసారి రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చుచేయాల్సి వస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో పాత అప్పు తీర్చడానికి కొత్త రుణానికి వెళ్తోంది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి రూ.18 వేల కోట్ల రుణాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి అయిదు నెలల్లోనే రూ.6 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అప్పు రూ.84వేల కోట్లకు చేరనుంది.
దీంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో విదేశీ ఆర్థి కసాయం కింద రూ.12వేల కోట్లు తీసుకున్నారు. ఇది ఇంకా రెండు రాష్ట్రాల మధ్య విభజన కాలేదు. ఇందులో ఏపీ వాటాగా రూ.6 వేల కోట్లు వరకు రావొచ్చు. దీంతో మొత్తం రుణభారం రూ.90వేల కోట్లకు చేరనుంది.
గత ఏడాది హుధుద్ తుపాను నష్టం కలిగించగా ఈసారి కరవు నెలకొంది. కేంద్ర ప్రభుత్వం విపత్తు సాయం అందిస్తున్నా అది అంతంత మాత్రంగానే ఉంది. రాజధాని ప్రాంతంలో మౌలికవసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం మార్చి 31న ఇచ్చిన రూ.1,500 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే ఇతరత్రా అవసరాలకు వాడుకుంది.
ఇప్పుడు నిర్మాణ పనులు ప్రారంభిస్తే మళ్లీ ఆ మొత్తాన్ని సొంతంగా సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అన్ని రకాల పన్నులు గరిష్ఠస్థాయికి చేరుకున్నందున కొత్తగా పన్నులు వేసే అవకాశమే లేదని చెబుతున్నారు. అందువల్ల పన్ను ఎగవేతలను అరికట్టి ఆర్థికవనరులను పెంచుకోవడం మిగిలిందంటున్నారు.ఇక, అమరావతి నిర్మాణం మొదలైతే ఈ అప్పు భారం మరింత పెరగనున్నట్లే.












Click it and Unblock the Notifications