బిజెపి ఝలక్: టిపై కాంగ్ మరో యూ టర్న్?
న్యూఢిల్లీ: విభజన విషయంలో ఢిల్లీ పెద్దలు మరోసారి యూ టర్న్ తీసుకుంటున్నారా? అంటే కావొచ్చని అంటున్నారు. తెలంగాణ, రాయల తెలంగాణపై జోరుగా చర్చ సాగుతోంది. వారం రోజులుగా రాయల తెలంగాణపై వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రాయల టినే ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
అయితే కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నాలుగు రోజుల క్రితం మాట్లాడుతూ చివరి నిమిషం వరకు మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు మళ్లీ రాయల టి నుండి తెలంగాణ బాట పట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు. తెలంగాణ వల్ల వచ్చే ఇబ్బందులతో అధిష్టానం రాయల టికి మొగ్గు చూపిందంటున్నారు. అలాగే రాయల టితో ఎక్కువ ఇబ్బందులు ఉంటే మళ్లీ తెలంగాణ వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

ఇప్పటికే రాయల తెలంగాణను గట్టెక్కించడంలో ఉన్న ఇబ్బందులు, ఇతరత్రా అనేక కారణాల నేపథ్యంలో అధిష్ఠానం ఈ విషయంలో పునరాలోచనలో పడిందని అంటున్నారు. అంతిమంగా కేబినెట్ ఆమోదం పది జిల్లాల తెలంగాణకే పడుతుందని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు కూడా భావిస్తున్నారు. రాయల తెలంగాణపై వడి వడిగా అడుగులు వేస్తున్న తరుణంలో తెలంగాణ ప్రాంత నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
సీమాంధ్రలోనూ నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా రాయల తెలంగాణకు మా మద్దతు ఉండదని బిజెపి స్పష్టమైన సంకేతాలు పంపించింది. ఈ పరిణామాలతో కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్రం ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. ఈ నేపథ్యంలో రాయల తెలంగాణ అంశంపై పునరాలోచించాలని సిడబ్ల్యూసి తీర్మానం, ఇప్పటికే ఆమోదించిన కేబినెట్ నోట్ ప్రకారం పది జిల్లాల తెలంగాణ ఇవ్వడమే సరైనదని ముఖ్య నేతలు అధిష్టానం ముందు చెబుతున్నారట. సీమాంధ్రకు భారీ ప్యాకేజీ, రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్, రాజధాని నిర్మాణానికి సహాయం చేయడంతో సీమాంధ్ర కొంత శాంతించవచ్చునని భావిస్తోందట.












Click it and Unblock the Notifications