75ఏళ్ల తర్వాత కలుసుకున్న భారత్ అక్క, చైనా చెల్లి
బీజింగ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనలో ఉన్న సందర్భంలోనే ఓ విశేష ఘటన అక్కడ చోటు చేసుకుంది. అదేంటంటే.. దాదాపు 70ఏళ్ల తర్వాత ఇద్దరు భారత్, చైనా అక్కా చెల్లెళ్లు కలుసుకున్నారు.
ఆ అక్కకు 81 ఏళ్లు. చెల్లికి 62 ఏళ్లు. తండ్రి ఒకరే అయినా తల్లులు వేరు. ఒకరు చైనాలో, మరొకరు భారత్‌లో పుట్టి పెరిగారు. చిన్నప్పట్నుంచి ఒకరి మొఖం ఒకరు చూసుకోకపోయినా.. చివరికి వృద్ధాప్యంలో తొలిసారిగా కలుసుకోగలిగారు.
వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన మెరైన్ ఇంజినీర్ అన్‌చి పొంగ్ 75 ఏళ్ల క్రితం తన కూతురు అన్ రోసీని (81) బీజింగ్‌లో వదిలి చెన్నైకి వచ్చి స్థిరపడ్డారు. చెన్నైలో మరో వివాహం చేసుకొన్న ఆయనకు అన్ (62) అనే కూతురు జన్మించింది.

ఇటీవల తన తండ్రి మూలాలను తెలుసుకొనేందుకు ప్రయత్నించిన అన్, బీజింగ్‌లో తన సోదరి ఉన్నట్లు సోషల్‌మీడియా ద్వారా తెలుసుకొంది. దీంతో ఆమెను కలుసుకొనేందుకు సహకరించాలని ప్రధాని మోడీకి అన్ భర్త విఆర్‌ఎస్ బాలాజీ లేఖరాశారు.
ఈ అక్కాచెల్లెళ్ల కలయికకు విదేశాంగశాఖ అధికారులు సహకారం అందించగా, చైనా ప్రభుత్వానికి చెందిన చైనా రేడియో ఇంటర్నేషనల్(తమిళ విభాగం) అందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో బీజింగ్‌లోని ఓ రెస్టారెంటులో ఈ సోదరీమణులిద్దరు గురువారం కలుసుకొన్నారు.
మొదటిసారి ఒకరినొకరు ప్రత్యక్షంగా కలుసుకొన్నవారు భావోద్వేగానికి లోనయ్యారు. భావోద్వేగాలతో నిండిన హృదయాలతో ఒకరి నొకరు హత్తుకున్నారు. అక్కకు చైనా రాదు, చెల్లెలికి తమిళ భాష రాదు దీంతో ఓ అనువాదకుడి సాయంతో వారిద్దరు మాట్లాడుకున్నారు.












Click it and Unblock the Notifications