ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు: సర్వేలకు కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్: వచ్చే ఎన్నికలకు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా ఆయన పెద్ద యెత్తున సర్వేలు చేయిస్తున్నారు. తొలిసారి ఆయన ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఈ సర్వేలు చేయిస్తున్నారు.
కోట్లాది రూపాయలు వెచ్చించి ఆయన మూడు సర్వేలు చేయిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ పనితీరుపైనే కాకుండా మంత్రులూ ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఆయన సర్వేలకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు...
కేసీఆర్ సర్వేలకు ఆదేశించడంతో, ఈ సర్వేలు నియోజకవర్గాలవారీగా జరుగుతుండడంతో తెరాస సభ్యుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దాదాపు 90 శాతం మందికి టికెట్లు ఇస్తానని ఆయన గతంలో చెప్పినప్పటికీ సర్వే ఫలితాలు వచ్చిన తర్వాత మనసు మార్చుకోవచ్చునని అంటున్నారు.

గత సర్వేలు ఇలా...
గతంలో చేయించిన సర్వేలకు నియోజకవర్గానికి 250 నుంచి 300 మందిని మాత్రమే సంప్రదించారు. మొత్తం 35 వేల మందిని సర్వేలకు ఎంంపిక చేసుకున్నారు. అయితే, ఈసారి సర్వేల్లో మరింత మందిని సంప్రదించే అవకాశం ఉంది.

ఒక్కో నియోజకవర్గంలో ఇలా...
సర్వేల్లో ఒక్కో నియోజకవర్గంలో 3 వేల మందిని సంప్రదించే అవకాశం ఉంది. ఇలా మొత్తం నియోజకవర్గాల్లో 3.5 లక్షల మందిని సంప్రదించి అభిప్రాయాలు తీసుకుంటారు. మూడు ఏజెన్సీలను కేసీఆర్ సర్వేలకు ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా సర్వేలు మొత్తం పది లక్షల మంది అభిప్రాయాలను కూడగడుతాయి.

పథకాలపై సర్వేలు...
తమ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై సర్వేలు జరుగుతాయి. పథకాలపై ప్రజల అభిప్రాయం ఏమిటి, అవి ప్రజలకు చేరుతున్నాయా, లేదా అనే విషయాలను సర్వేల ద్వారా రాబడుతారు. ఇంకా ప్రజలు ఏం కోరుకుంటున్నారనే అంశం కూడా సర్వేల్లో భాగంగా ఉంటుంది.

రెండో సర్వే పార్టీపై...
రెండో సర్వే పార్టీ పనితీరును అంచనా వేస్తుంది.. పార్టీ చురుగ్గా పనిచేస్తుందా, లేదా అనే విషయాన్ని ప్రజల నుంచి కనుక్కుంటారు. పార్టీ నాయకులకు నియోజకవర్గాలకు వస్తున్నారా, లేదా అనే విషయంపై కూడా అభిప్రాయాలు సేకరిస్తారు. అంతేకాకుండా పార్టీ విధానాల్లో ప్రజలు ఏమైనా మార్పు కోరుకుంటున్నారా అనేది కూడా ముఖ్యమైన అంశంగానే ఉంటుంది.

మూడో సర్వే వారిపైనే...
మూడో సర్వే ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై జరుగుతోంది. వారి పనితీరును బేరీజు వేస్తుంది. వారు నియోజకవర్గానికి వస్తున్నారా, ప్రజలను పట్టించుకుంటున్నారా, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారా అనే ప్రశ్నలకు సర్వేల ద్వారా జవాబులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారి విజయావకాశాలపై కూడా సర్వే అంచనా వేస్తుంది.

జనవరి చివరినాటికి కేసిఆర్ చేతికి...
మూడు భారీ సర్వేల ఫలితాలు జనవరి నెలాఖరునాటికి కేసిఆర్ చేతికి అందుతాయి. ఆ నివేదికల ఆధారంగా ప్రభుత్వం, పార్టీ, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై సమీక్ష జరిపి తగిన చర్యలు తీసుకుంటారు. అవసరమైతే సిట్టింగులను మార్చే ఆలోచన కూడా చేస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications