యాదృచ్ఛికమే: తమిళనాట ఈ ముగ్గురూ తాత్కాలికమే: ఎవరోఒక్కరే శాశ్వతం!
యాదృశ్చికంగా తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం, గవర్నర్ విద్యాసాగర్ రావు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశకళ.. ఈ ముగ్గురు కూడా తాత్కాలికమైన పదవుల్లోనే కొనసాగుతుండటం గమనార్హం.
చెన్నై: తమిళనాడులో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం మధ్య పోటీ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయమే కీలకంగా మారనుంది.
ప్రస్తుతం అందరి దృష్టి ఈ ముగ్గురిపైనే ఉంది. అయితే, యాదృశ్చికంగా వీరు ముగ్గురు కూడా తాత్కాలికమైన పదవుల్లోనే కొనసాగుతుండటం గమనార్హం. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు తమిళనాడు గవర్నర్‌గా అదనపు(ఇంఛార్జీ) బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ కూడా 'తాత్కాలిక' బాధ్యతలనే నిర్వహిస్తున్నారు. పార్టీ నియమాల ప్రకారం ప్రధాన కార్యదర్శి కావాలంటే కనీసం ఐదేళ్లపాటు పార్టీ సభ్యుడిగా ఉండాలి. కార్యకర్తలు ఓటింగ్ ద్వారానే ఎన్నుకోవలసి ఉంది.

కానీ, శశికళను సర్వసభ్య సమావేశంలో 'తాత్కాలిక ప్రధాన కార్యదర్శి'గా ఎన్నుకున్నారు. ఇక పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి గత ఆదివారం రాజీనామా చేయడం, ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించడంతో.. ఆయన కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
ప్రస్తుతం బల నిరూపణ కోసం శాయశక్తుల కృషి చేస్తున్న శశికళ, పన్నీరులలో ఎవరో ఒకరు మాత్రమే శాశ్వత ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు. మొన్నటి వరకు శశికళకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇప్పుడు పన్నీరు వైపు వస్తుండటంతో తమిళ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఎవరూ సీఎం అవుతారనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.












Click it and Unblock the Notifications