రఘురామకు మందకృష్ణ వార్నింగ్- చంద్రబాబు దగ్గరే తేలుస్తా..!
ఏపీలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు (Raghurama Krishanm Raju) ఈ మధ్య తన నియోజకవర్గంలోని ఆకివీడు పెదపేటలో ఉన్న గొంతెనమ్మ ఆలయాన్ని కూల్చి అక్కడ రామాలయ నిర్మాణం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం హైకోర్టుకు కూడా చేరింది. స్థానికంగా ఉన్న దళితుల్ని అడ్డుకుంటూ రామాలయ నిర్మాణం కోసం రఘురామ చేస్తున్న ప్రయత్నాలపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళిత వర్గాలకు చెందిన వారిని ఎవరు ఇబ్బంది పెట్టినా, ఆత్మ గౌరవం దెబ్బ తీసేలా వ్యవహరించినా ఊరుకోబోమని మందకృష్ణ మాదిగ రఘురామను ఉద్దేశించి హెచ్చరించారు. తమపై దాడి చేసే వాళ్లు ఏ స్థాయి వారైనా సరే ఉమ్మడిగా ఎదుర్కొంటామన్నారు. ఆకివీడు గుడి విషయంలో హైకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అక్కడ గొంతేనమ్మ గుడి ఉందా, గ్రామ సావిడి ఉందా, లేక రామాలయం ఉందా? అనే అంశంలో హైకోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ వివాదానికి కారణం రఘురామరాజే అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వ గెలుపులో తాము ప్రధాన భాగస్వాములుగా ఉన్నామని ఆయన గుర్తు చేశారు. రామాలయం వివాదాన్ని తానే స్వయంగా సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్తానని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా ఉంటూ రఘురామ మాట్లాడే మాటలు.. ఆయన పనిచేసే పార్టీకి మేలు చేయాలే తప్ప కీడు చేయకూడదన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రఘురామ వ్యాఖ్యలు దళిత సమాజాన్ని పార్టీకి, ప్రభుత్వానికి దూరం చేసేవిగా ఉన్నాయన్నారు. దళితులను అవమానించే విధంగా రఘురామ వ్యాఖ్యలు ఉన్నాయని మందకృష్ణ విమర్శించారు.














Click it and Unblock the Notifications