"నాన్నా వద్దు.. ప్లీజ్".. మోహన్ కాదు మృత్యువు!
ఆ ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. భర్త సిమెంట్ షాపు యజమాని, భార్య టైలరింగ్ ఫాప్ ఓనర్, ఇద్దరు చిన్నారులు చదువుల్లో ముందుండేవారు. కానీ, బుధవారం మధ్యాహ్నం ఆ ఇంటి గడప దాటిన మృత్యువు, కొన్ని గంటల వ్యవధిలోనే ఆ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి.. దీని వెనుక ఉన్న మిస్టరీ ఇప్పుడు పోలీసులను సైతం వేధిస్తోంది.
తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలో వెంకటకృష్ణపాలెం చాకలి వీధిలో ఉండే మోహన్, మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి వెళ్లాడు. షాపులో ఉన్న బావ బాలకృష్ణ ఎంతసేపు చూసినా మోహన్ తిరిగి రాలేదు. అనుమానం వచ్చి ఇంటికి వెళ్లి చూసిన బాలకృష్ణకు అక్కడ కనిపించిన దృశ్యం గుండెల్ని పిండేసింది. మోహన్ తల్లి చంద్రకళ, భార్య హరిత విగతజీవులుగా పడి ఉన్నారు. తన చేతులతోనే, తన సొంత మనుషుల మెడకు చున్నీ బిగించి ప్రాణాలు తీసిన మోహన్, అప్పటికే అక్కడి నుంచి మాయమయ్యాడు.

సాయంత్రం 4:00 గంటలు
హత్యలు చేసిన కాసేపటికే మోహన్ ఒక పకడ్బందీ ప్లాన్ వేశాడు. పిల్లలు చదువుకునే స్కూలుకు వెళ్లి, "మామగారు చనిపోయారు" అని అబద్ధం చెప్పి 9వ తరగతి చదువుతున్న కొడుకును, 7వ తరగతి చదువుతున్న కూతురిని బైక్‌పై ఎక్కించుకున్నాడు. ఊరంతా గాలిస్తున్న పోలీసుల కళ్లు గప్పి, ఆ ఇద్దరు పసిపిల్లలతో కలిసి గంటల తరబడి రోడ్లపై తిరుగుతూనే ఉన్నాడు. ఆ చిన్నారులకు అప్పటికి తెలీదు.. తమ ఇంట్లో అమ్మా, నానమ్మ శవాలై పడి ఉన్నారని, తమని తీసుకెళ్తున్న తండ్రే వారిని చంపాడని!
రాత్రి 7:15 గంటలు - వేపగుంట రైల్వే ట్రాక్.. చివరి సీన్
చీకటి పడింది.. పుత్తూరు సమీపంలోని వేపగుంట రైల్వే ట్రాక్ వద్ద మోహన్ బైక్ ఆగింది. ఒక్కసారిగా పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. తండ్రి చేస్తున్న పని చూసి షాకైన బిడ్డలు, "నాన్నా వద్దు.. మాకోసం బ్రతుకు" అంటూ ఏడుస్తూ ఆయన్ను పక్కకు లాగే ప్రయత్నం చేశారు. సరిగ్గా అదే సమయంలో 100 కిలోమీటర్ల వేగంతో ఎగ్మోర్ - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ దూసుకొచ్చింది. తనను కాపాడబోయిన బిడ్డలను కూడా ట్రైన్ వేగంగా ఢీ కొట్టడంతో.. మోహన్ తో పాటు చిన్నారులు ఇద్దరు కూడా స్పాట్ లోనే చనిపోయారు. లోకో పైలట్ సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకునేసరికి అక్కడ మిగిలింది కేవలం ఛిద్రమైన మృతదేహాలు మాత్రమే.
నరాలు తెగే మిస్టరీ: అసలు కారణం ఏంటి?
ఈ కేసులో పోలీసులను వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న.. అసలు మోహన్ ఎందుకు ఇలా చేశాడు? ఆర్థిక సమస్యలా? లేవు.. పైగా తన సోదరికి అప్పు తీర్చమని బుధవారం ఉదయమే డబ్బులు కూడా పంపాడు. కుటుంబ గొడవలా? స్థానికుల ప్రకారం అలాంటి ఆస్కారమే లేదు. మానసిక స్థితి? అంతా నార్మల్‌గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా సీరియల్ కిల్లర్‌లా ఎలా మారాడు? తల్లిని, భార్యను హతమార్చి.. తనను కాపాడబోయిన కన్నబిడ్డల ప్రాణాలను కూడా బలి తీసుకున్న ఈ ఘటన వెనుక ఉన్న అసలు 'మోటివ్' ఏంటనేది ఇప్పుడు తిరుపతి జిల్లాలో అతిపెద్ద సస్పెన్స్. పోలీసులు కాల్ డేటా ఆధారంగా ఈ మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications