దేశవ్యాప్తంగా జూన్ 13 వరకు 'స్మార్ట్ లాక్ డౌన్'..!! చమురు, గ్యాస్, విద్యుత్ సంక్షోభం వేళ..!!
పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం కారణంగా ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న పాకిస్థాన్ లో ఇప్పుడు పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా పరిస్థితులు మరింతగా దిగజారాయి. సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇటీవల పాకిస్థాన్ ప్రభుత్వం స్మార్ట్ లాక్ డౌన్ ను విధించిన విషయం తెలిసిందే. రాత్రి 8 గంటల వరకే దుకాణాలు, షాపింగ్ మాల్స్ తెరిచి ఉంటాయి. అలాగే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, పనిదినాలను నాలుగు రోజులకు కుదింపు, విదేశీ ప్రయాణాలపై నిషేధం ఇలా అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంది.
అయితే మార్చి 9 పాకిస్థాన్ లో విధించిన స్మార్ట్ లాక్ డౌన్ ను తాజాగా పాకిస్థాన్ ప్రభుత్వం జూన్ 13 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఉత్తర్వులు జారీ చేశారు. చమురు, గ్యాస్, విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కీలక ఆంక్షలు విధించారు.
ప్రభుత్వ వాహనాలకు ఇచ్చే ఇంధన కోటాను 50 శాతం తగ్గించారు. అలాగే 60 శాతం ప్రభుత్వ వాహనాలను రోడ్లపైకి రాకుండా నిలిపివేశారు. విదేశీ ప్రయాణాలపై నిషేధం పొడిగింపు.. మంత్రులు, ప్రభుత్వ అధికారులు అత్యవసరం అయితే తప్ప విదేశాలకు వెళ్లకూడదు. ఇక అన్ని శాఖలు తమ ఖర్చులను 20 శాతం తగ్గించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే కొత్త వాహనాలు, ఏసీలు, ఫర్నీచర్ కొనుగోళ్లపై నిషేధం విధించారు.
ఇక ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ నియంత్రణలోని సంస్థల ఉద్యోగుల జీతాల్లో 5 శాతం నుంచి 30 శాతం వరకు కోత విధించారు. అటు ఎంపీల జీతాల్లోనూ 25 శాతం కోత విధించే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. ఇక పాకిస్థాన్ వ్యాప్తంగా పని దినాలను నాలుగు రోజులకు కుదించారు. అలాగే సామాన్యులపై భారం పడకుండా మోటార్ సైకిలిస్టులు, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఆపరేటర్లకు ఇచ్చే చమురు సబ్సిడీలను ఒక నెలపాటు పొడిగించారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం కారణంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా పౌరులను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, బంగారం కొనుగోళ్లు ఆపడం, స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం, అలాగే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు.












Click it and Unblock the Notifications