TVK-Congress Alliance: కాంగ్రెస్, ఇతర పార్టీలకు విజయ్ ఆఫర్ చేస్తున్న శాఖలివే..!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ రావడంతో అత్యధిక స్ధానాలు సాధించిన పార్టీగా నిలిచిన విజయ్ టీవీకే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ టీవీకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన విజయ్.. ప్రభుత్వానికి మద్దతిచ్చే పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. ఇందులో కాంగ్రెస్ తో పాటు పలు చిన్నా చితకా పార్టీలు ఉన్నాయి. అదే సమయంలో వాటికి ఆఫర్ చేస్తున్న శాఖలపైనా కీలక సమాచారం బయటికి వస్తోంది. టీవీకే-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం (Tvk-Congress Alliance) ఏర్పాటు మాత్రం ఖాయంగా తెలుస్తోంది.
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే 108 సీట్లు సాధించింది. అలాగే ప్రస్తుతం డీఎంకే సెక్యులర్ కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్ 5, ఐయూఎంఎల్, సీపీఐ, సీపీఎం, వీసీకే తలో రెండు సీట్లు సాధించాయి. డీఎండీకే ఒక్క సీటు సాధించింది. వీరందరినీ కలిపితే 14 సీట్లు ఉన్నాయి. దీంతో డీఎంకేను వీడి వీరంతా టీవీకే సంకీర్ణ ప్రభుత్వంలో చేరితే మొత్తం సీట్ల సంఖ్య మ్యాజిక్ మార్కు 118 దాటి 122కు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో వీరందరినీ లేకపోతే కొంత మందిని కూటమిలో చేర్చుకునేందుకు విజయ్ టీమ్ చర్చలు జరుపుతోంది.

అలాగే వీరిలో కాంగ్రెస్ కు రెండు కేబినెట్ బెర్తులు, మిగతా పార్టీలకు తలో కేబినెట్ బెర్త్ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆర్థిక, హోం, రెవెన్యూ, పాఠశాల విద్య, సామాజిక సంక్షేమం, ప్రజా ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి శాఖలు ఉన్నట్లు సమాచారం. వీటిని ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపై టీవీకేలోనూ అంతర్గతంగా చర్చ జరుగుతోంది. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ తీసుకోవాలి. మిగతా పార్టీలతో పెద్దగా ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు ఉన్నపళంగా వీళ్లంతా డీఎంకేను వీడి విజయ్ పంచన చేరితే భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియదు. ముఖ్యంగా కాంగ్రెస్ డీఎంకే కు హ్యాండిస్తే.. జాతీయ స్ధాయిలో ఇండియా కూటమిని నడుపుతున్న కాంగ్రెస్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.














Click it and Unblock the Notifications