టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్
అయిదువారాల పాటు ఏకధాటిగా కొనసాగిన ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి తాత్కాలిక విరామం లభించింది. రెండు వారాల పాటు సీజ్ ఫైర్ కు ఆయా దేశాలు అంగీకరించాయి. ఆ వెంటనే దౌత్య ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇరాన్ పాకిస్తాన్ ద్వారా అమెరికాకు పంపిన 10 సూత్రాల ప్రతిపాదనపై ఈ నెల 10న ఇస్లామాబాద్‌లో ఇరు పక్షాలు చర్చించనున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చర్చలకు రంగం సిద్ధమైందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తెలిపింది.
ఈ పరిస్థితుల మధ్య ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిపై తన పట్టును మరింత బిగించింది. ఈ మార్గం గుండా వెళ్లే చమురు ట్యాంకర్లపై ప్రతి బ్యారెల్‌కు ఒక డాలర్ చొప్పున టోల్ విధించాలని యోచిస్తోంది. ఈ మొత్తాన్ని క్రిప్టోకరెన్సీలో చెల్లించాలని ఇరాన్ పట్టుబట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నిర్ణయం- కాల్పుల విరమణ ఉన్నా ఇరాన్ ఈ కీలక జలమార్గంపై ఆధిపత్యాన్ని వదులుకోవడం లేదని స్పష్టం చేస్తోంది.

దీనిపై ఫైనాన్షియల్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇకపై ఈ మార్గం గుండా వెళ్లే ప్రతి నౌకను ఇరాన్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎగుమతి యూనియన్ నిశితంగా తనిఖీ చేస్తుంది. పూర్తి తనిఖీ తర్వాతే ట్యాంకర్లకు ముందుకు వెళ్లడానికి అనుమతి లభిస్తుంది. కాల్పుల విరమణ సమయంలో ఆయుధాల రవాణాను నిరోధించడమే తమ తనిఖీల లక్ష్యమని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం- ట్యాంకర్లు తమ సరుకు వివరాలను ఈమెయిల్ ద్వారా పంపాలి. అధికారులు టోల్ చెల్లించిన తర్వాతే అవి ముందుకు కదలాల్సి ఉంటుంది.
ప్రస్తుతం హార్ముజ్, గల్ఫ్ బే లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. అనుమతి, టోల్ లేని నౌకలపై దాడులు చేస్తామని రేడియో ద్వారా హెచ్చరికలు అందుతున్నాయి. ఈ కఠిన నిబంధనల వల్ల గల్ఫ్ సముద్రంలో దాదాపు 400లకు పైగా కార్గో షిప్ లు నిలిచిపోయి. వాటి రాకపోకలు స్తంభించాయి. మిలియన్ల బ్యారెళ్ళ చమురు నిలిచిపోవడంతో ఆ ప్రాంతం భారీ పార్కింగ్ లాట్‌ను తలపిస్తోంది. పెద్ద కంపెనీలు భయంతో ముందుకు కదలలేక ఆగిపోయాయి. ఇరాన్ చేపట్టిన ఈ చర్య చమురు మార్కెట్ లో అలజడి సృష్టించింది. మయర్స్క్ (Maersk) వంటి షిప్పింగ్ కంపెనీలు పరిస్థితులు మెరుగుపడే వరకు వేచి ఉన్నాయి.
ఈ పరిణామం అమెరికా-ఇరాన్ శాంతి చర్చలలో ప్రధాన అడ్డంకిగా మారిందన వాదనలు సైతం లేకపోలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ జలసంధిని పూర్తిగా, సురక్షితంగా తెరిచి ఉంచితేనే ఏ ఒప్పందమైనా నిలబడుతుందని స్పష్టం చేశారు కూడా. ఇరాన్ టోల్ ఆలోచనను ఒమన్ వంటి దేశాలు తప్పు పట్టాయి. అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని చెబుతున్నాయి. అమెరికా ఒత్తిడి మధ్య ఇరాన్ తన పట్టుదలను కొనసాగిస్తుందా లేదా వెనక్కి తగ్గుతుందా అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications