కూటమి రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు - బీజేపీ, జనసేన నుంచి అనూహ్యంగా..!!
ఏపీ నుంచి కూటమి రాజ్యసభ అభ్యర్ధులు దాదాపు ఖరారయ్యారు. రాజ్యసభకు ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో నలుగురు పదవీ విరమణ చేయనున్నారు. ఈ నలుగురి స్థానంలో కూటమి పార్టీల నుంచి నలుగురు ఎంపిక కానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. సామాజిక - ప్రాంతీయ లెక్కల ఆధారంగా వీరి పైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. బీజేపీ ఇప్పటికే తమ అభ్యర్ది విషం పై భాగస్వామ్య పక్షాలకు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.
ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిక పైన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీతో పాటు సానా సతీష్ పదవీ కాలం వచ్చే నెలతో ముగుస్తోంది. కూటమిలోని మూడు పార్టీలు ఈ నాలుగు సీట్ల పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా టీడీపీకి రెండు, జనసేన - బీజేపీకి చెరో సీటు కేటాయించనున్నారు. ఇప్పటికే ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా.. టీడీపీ - జనసేన నుంచి దక్కే మూడు స్థానాల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. అందులో భాగంగా సిట్టింగ్ ఎంపీ సానా సతీశ్ కు రెన్యువల్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. బీసీ, ఎస్సీ వర్గాల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. టీడీపీ నుంచి రాజ్యసభ స్థానం ఆశిస్తున్నవారిలో భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ.. ఎస్సీ వర్గం నుంచి అవకాశం కల్పిస్తే తన పేరు పరిశీలించాలని సీనియర్ నాయకుడు వర్ల రామయ్య పేరు వినిపిస్తోంది.
బీజేపీ నుంచి అన్నామలై... జనసేన నుంచి ఆయనే..!
అయితే.. ఈ సారి అనూహ్యంగా ముస్లి మైనార్టీ వర్గం కు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగు తోంది. ఈ కోటాలో ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న ఎంఏ. షరీఫ్ కు దక్కే అవకాశం ఉంది. బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయితే సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కు ఖాయం అవుతుందని చెబుతున్నారు. జనసేన నుంచి ఇప్పటి వరకు లింగమేనని రమేశ్ పేరు వినిపించినా.. ఇప్పుడు అనూహ్యంగా పారిశ్రామిక వేత్త బండారు నరసింహరావు, టాలీవుడ్ లో వరసపెట్టి సినిమాలు చేస్తున్న ప్రముఖ నిర్మాత కూడా ఒకరు రేసులోకి వచ్చారు.
ఇక.. బీజేపీ నుంచి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్నామలై విషయంలో కూటమి నేతలకు బీజేపీ నేతలు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. చివరి నిమిషం లో అనూహ్య మార్పులు జరిగితే మినహా ఈ పేర్లలోనే రాజ్యసభకు తుది ఎంపిక ఉండే అవకాశం ఉంది. కాగా, రేపు (గురువారం) రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.













Click it and Unblock the Notifications