Pakistan: "మింగడానికి మెతుకు లేదు.. మనకెందుకు అన్నాయ్ ఈ మీడియేషన్"
పశ్చిమాసియాలో 60 రోజులుగా పైగా ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో అనేక దేశాలు చమురు, గ్యాస్ సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇక అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి యుద్ధం కారణంగా పెనం లోంచి పొయ్యిలో పడినట్లుగా మారింది. ఇప్పటికే ఆ దేశంలో లాక్ డౌన్ విధించారు. సాధారణ లాక్ డౌన్ తోపాటు ఎనర్జీ లాక్ డౌన్ కూడా విధించారు. అయితే పాకిస్థాన్ పరిస్థితి అంతకంతకూ దయనీయమైన స్థితిలోకి వెళ్తూనే ఉంది.
ప్రస్తుతం పాకిస్థాన్ లో విద్యుత్ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. రోజుకు రెండు మూడు గంటలకు మించి కరెంట్ కోతలు ఉండవని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. ఇక దేశంలోని చాలా ప్రాంతాల్లో గంటల తరబడి బ్లాక్ అవుట్స్ దర్శనమిస్తున్నాయి. పీక్ అవర్స్ లో అయితే దేశంలో ఏకంగా 4,500 మెగావాట్స్ విద్యుత్ కొరత ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే గల్ఫ్ దేశాల నుంచి పాకిస్థాన్ కు రావాల్సిన ఎల్ఎన్జీ సరఫరా పూర్తిగా తగ్గిపోయింది. దాంతో దేశంలోని గ్యాస్ ఆధారిత ప్లాంట్లు మూతపడ్డాయి. ఇక నదీ జలాలు కూడా తగ్గిపోయిన కారణంగా దేశంలో హైడ్రో పవర్ ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోయింది.
ఈ పరిస్థితుల్లో ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలకు పాకిస్థాన్ వేదిక కావడంపై ఆ దేశ ప్రజలే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇటీవల జరిగిన శాంతి చర్చలు విఫలం అయిన విషయం తెలిసిందే. దాంతో మరోసారి ఇస్లామాబాద్ వేదికగా రెండో దశ శాంతి చర్చలకు ఇరాన్- అమెరికా సన్నద్ధం అవుతున్నాయి. ఈ మేరకు ఏప్రిల్ 21 మంగళవారం నుంచి శాంతి చర్చలు ప్రారంభం అవుతాయని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. అయితే రెండో దశ చర్చలకు ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

అయితే పాకిస్థాన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆ దేశ ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. దౌత్య పరమైన చర్చల కంటే దేశంలో ఉన్న సమస్యలను పట్టించుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం పెరుగోందని.. విద్యుత్ కోతలతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశ సమస్యలపై దృష్టి పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు దేశం చీకట్లో మగ్గుతుంటే షెహబాజ్ ప్రభుత్వం మాత్రం శాంతి చర్చలంటూ తిరుగుతోందని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications