డెత్ బెడ్ పై పాకిస్థాన్.. వారానికి రూ. 8 వేల కోట్లు ఖతం..!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య రెండు నెలలుగా సాగుతున్న యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధి ఇంకా మూసివేసే ఉంది. చమురు రవాణాకు కీలకంగా ఉన్న హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇక అసలే అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అక్కడి పరిస్థితులు మరింత దిగజారాయి. చమురు, గ్యాస్ కొరత కారణంగా అక్కడ లాక్ డౌన్ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి 8 గంటల వరకే షాపింగ్ మాల్స్, దుకాణాలు తెరిచి ఉంచుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
ఇక ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా తమ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఛిన్నాభిన్నం అయిందని తాజాగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో యుద్ధాన్ని నిలిపివేసి.. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. తాజాగా పాకిస్థాన్ లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరిగాయని దీనివల్ల పాకిస్థాన్ కు ఒక వారం చమురు బిల్ 300 మిలియన్ డాలర్ల నుంచి 800 మిలియన్ డాలర్ల వరకు పెరిగిందని షెహబాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. 800 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 7,594 కోట్లు అని అర్థం వస్తోంది. పాకిస్థాన్ కేవలం చమురు దిగుమతి కోసమే వారానికి ఇంత మొత్తం చెల్లించాలంటూ పాకిస్థాన్ ఆవేదన వ్యక్తం చేసింది.

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ గత రెండేళ్ల నుంచి గాడి తప్పిందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టాలని చూస్తున్నా ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా తమ దేశ ఆర్థిక పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల పాకిస్థాన్ అభివృద్ధి ఆగిపోయిందని అన్నారు. గతంతో పోల్చితే వారాంతపు చమురు ఖర్చు 167 శాతం పెరిగిందని పాక్ ప్రధాని పేర్కొన్నారు. పెరిగిన ధరల కారణంగా దేశవ్యాప్తంగా చమురు వినియోగం కొంతమేరకు తగ్గిందని తెలిపారు. దేశంలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. మరోవైపు పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకే పాకిస్థాన్ శాంతి చర్చలు జరుపుతోందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications