మరణమే మరిచిపోయిన మాయా ద్వీపం.. ఏమిటా ‘సిగా.. సిగా’ మంత్రం?
ఆధునిక ప్రపంచం పరుగుల మీద ఉంది.. ఉరుకులు, హడావుడి, ఒత్తిడి వెరసి మనిషి ఆయుష్షును హరిస్తున్నాయి. కానీ, ఈ ప్రపంచానికి దూరంగా ఒక ద్వీపం ఉంది. అక్కడ కాలం నెమ్మదిగా కదులుతుంది. మనుషులు మరణించడాన్నే మరిచిపోయారా అన్నట్లుగా వందేళ్ల వయసులోనూ కుర్రాళ్లలా తిరుగుతుంటారు. గ్రీస్‌లోని 'ఇకారియా' (Ikaria) ద్వీపమే ఆ అద్భుత ప్రదేశం. ప్రపంచంలోని ఐదు 'బ్లూ జోన్లలో' (అత్యధిక ఆయుర్దాయం గల ప్రాంతాలు) ఒకటిగా గుర్తింపు పొందిన ఈ ద్వీపవాసుల ఆరోగ్య రహస్యాలపై వన్ ఇండియా ప్రత్యేక కథనం.
ఇకారియా ప్రజల సుదీర్ఘ ఆయురారోగ్యాలకు ప్రధాన కారణం గ్రీక్ భాషలో వారు చెప్పుకునే 'సిగా.. సిగా' (Siga-Siga). అంటే తెలుగులో 'మెల్ల మెల్లగా' అని అర్థం. వీరు ఏ పనిలోనూ హడావుడి పడరు. గడియారం ముల్లుతో పోటీ పడరు. ప్రశాంతమైన, నిదానమైన జీవనశైలి వల్ల వీరి శరీరంలో ఒత్తిడిని కలిగించే 'కార్టిసాల్' హార్మోన్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ఫలితంగా క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధులు వీరి దరి చేరవు. నిత్యం సంతోషంగా ఉండటమే వీరికి తెలిసిన ఏకైక మందు.

నడక కాదు.. నడకలోనే వ్యాయామం!
ఈ ద్వీపం భౌగోళిక స్వరూపమే ఇక్కడి ప్రజలను ఫిట్‌గా ఉంచుతోంది. ఇకారియా అంతా ఎగుడుదిగుడుగా ఉండే కొండ ప్రాంతం. దైనందిన అవసరాల కోసం ఇక్కడి ప్రజలు రోజుకు కనీసం 2 నుంచి 3 కిలోమీటర్లు కొండలు ఎక్కడం, దిగడం చేస్తుంటారు. జిమ్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈ సహజమైన శారీరక శ్రమ వారి కండరాలను, గుండెను పటిష్టంగా ఉంచుతోంది. వృద్ధాప్యంలో కూడా వారు కర్ర సాయం లేకుండా గలగలా నడిచేస్తారంటే ఆశ్చర్యం కలగక మానదు.
ప్రకృతి సిద్ధమైన ఆహారం.. బలమైన బంధాలు!
ఆహారమే ఔషధంగా ఇక్కడి వారు భావిస్తారు. రసాయనాల్లేని స్వచ్ఛమైన ఆకుకూరలు, కూరగాయలు, ఆలివ్ ఆయిల్ వీరి ఆహారంలో ప్రధాన భాగం. మాంసాహారాన్ని చాలా అరుదుగా తీసుకుంటారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇక్కడ ఒంటరితనం అనే పదమే వినిపించదు. సామాజిక బంధాలు, కుటుంబ అనుబంధాలు ఇక్కడ చాలా బలంగా ఉంటాయి. అందరూ కలిసి మెలిసి ఉత్సవాలు జరుపుకోవడం, కబుర్లు చెప్పుకోవడం వీరి మానసిక ఉల్లాసానికి కారణం.
థెర్మా.. వేడి నీటి బుగ్గల మ్యాజిక్!
ఈ ద్వీపంలో 'థెర్మా' అనే సహజ సిద్ధమైన వేడి నీటి బుగ్గలు ఉన్నాయి. ఈ నీటిలో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు నయం కావడమే కాకుండా, కీళ్ల నొప్పులు తగ్గుతాయని ప్రజల నమ్మకం. ఈ ఖనిజ లవణాల నీటి స్నానం వారిని మరింత ఉత్తేజంగా మారుస్తోంది. మరణమే మరిచిపోయిన ఈ ద్వీపం, నేటి ఉరుకుల పరుగుల సమాజానికి 'ప్రశాంతతకు మించిన ఆరోగ్యం లేదని' మౌనంగా సందేశమిస్తోంది.














Click it and Unblock the Notifications