"ఎలక్ట్రిక్ వాహనాలదే భవిష్యత్.. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఒక అడుగు ముందే ఏపీ"
భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈవీల తయారీలో హీరో మోటార్స్ సంస్థ పెద్ద ఎత్తున దృష్టి సారించాలని సూచించారు. తిరుపతి జిల్లా సత్యవేడులోని మాదన్నపాలెం వద్ద హీరో మోటార్స్ సంస్థకు చెందిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 కు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. "హీరో మోటార్స్ వ్యవస్థాపక ఛైర్మన్ బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ పారిశ్రామిక వేత్తగా జాతి నిర్మాణానికి సహకరించిన గొప్ప వ్యక్తి. హీరో మోటార్స్ సంస్థ వేరే రాష్ట్రంలో ప్లాంట్ పెట్టాలనుకుంటే వారితో ప్రత్యేకంగా చర్చించి ఏపీలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఒప్పించాం. 2018లో తిరుపతిలో శంకుస్థాపన చేసిన హీరో మోటార్స్ ప్లాంట్ ఇప్పుడు పెద్ద ఎత్తున వాహనాలను ఉత్పత్తి చేస్తోంది.
ఇప్పుడు విడా పేరుతో ఎలక్ట్రిక్ టూ వీలర్లను ఉత్పత్తి చేయడం సంతోషంగా ఉంది. హీరో సంస్థకు ఉన్న అన్ని ఉత్పత్తి కేంద్రాల కంటే ఇక్కడి యూనిట్ ను ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయాలి. ప్లాంట్ ఏర్పాటులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహకరిస్తుంది. వేగంగా ప్రాజెక్టు యూనిట్ ను పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలి. హీరో సంస్థ ప్రకటించిన మేరకు రూ.3,200 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్ విస్తరణ పనులు ప్రారంభించాలని కోరుతున్నాను.
భవిష్యత్ అంతా ఈవీలదే. డిమాండ్ కు తగినట్టుగా ఈవీల ఉత్పత్తికి హీరో సంస్థ సిద్దంగా కావాలి. ఇవాళ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ 2.0 శంకుస్థాపన చేయటం సంతోషంగా ఉంది. గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తికి ప్రణాళికలు సిద్దం చేసుకున్నాం. ఇప్పటికే 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఒక అడుగు ముందే ఉంది. హీరో సంస్థలో పనిచేసే ఉద్యోగుల్లో 40 శాతం మంది మహిళలే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళలు కష్టపడి పనిచేస్తారు.
త్వరగా నేర్చుకునే మనస్తత్వం వారికి ఉంది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రోడ్డు, రైలు, పోర్టు, ఎయిర్ కనెక్టివిటీ ఉంది. సేద్యంతో పాటు పరిశ్రమలకూ నీరు అందించేలా ఏపీలో కార్యాచరణ చేపట్టాం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో రైతులనూ భాగస్వాములను చేస్తున్నాం.
ఒప్పందాలతో పాటు పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన అన్ని చర్యలూ ప్రభుత్వం తీసుకుంటుంది. పరిశ్రమలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. విశాఖలో గూగుల్ తో పాటు ఇతర సంస్థలూ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. వనరుల్ని దృష్టిలో ఉంచుకునే డేటా సెంటర్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాం. అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై ప్రత్యేకంగా దృష్టి
"ఏపీ ఖనిజ వనరులకు నిలయం.. ఇటీవలే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ లో మైనింగ్ ప్రారంభించాం. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా మారుతుంది. ఈ నెల 3న కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తున్నాం. 2028 నాటికల్లా ఉత్పత్తి ప్రారంభించేలా స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి అవుతుంది. గ్రీన్ ఎనర్జీ సహా పునరుద్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. తిరుపతిలో మహిళా పోలీసులకు ఎలక్ట్రిక్ టూవీలర్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన హీరో మోటార్స్ సంస్థకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.
పీ4 ద్వారా పేదల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. సంపద సృష్టిస్తూనే పేదలకు ఫలాలు అందాలన్నది మా ఆలోచన. అసమానతలు లేని సమాజం కోసం అందరం కృషి చేయాలి. ఏపీలో వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ నినాదంతో పనిచేస్తున్నాం. డ్వాక్రా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. పొదుపు చర్యల్లో ఏపీలోని డ్వాక్రా మహిళలు దేశానికే ఆదర్శంగా ఉన్నారు అని ముఖ్యమంత్రి అన్నారు.
హీరోస్ ఆఫ్ టుమారో స్కాలర్ షిపులు
స్వర్ణాంధ్ర ఫౌండేషన్ తో కలిసి పీ4 లో భాగస్వామ్యం వహించేందుకు హీరో మోటార్స్ కార్పోరేషన్ ముందుకు వచ్చింది. ఆ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ బ్రిజ్ మోహన్ లాల్ ముంజాల్ హీరోస్ ఆఫ్ టుమారో పేరిట ఏర్పాటు చేసిన స్కాలర్‌షిప్ లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు హీరో మోటార్స్ కార్పోరేషన్ ఉత్పత్తి ప్లాంట్ ను సందర్శించారు.

ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పవన్ ముంజాల్ స్వయంగా ఈవీ వాహనాన్ని డ్రైవ్ చేస్తూ ముఖ్యమంత్రికి ప్లాంట్ లోని వేర్వేరు విభాగాలను చూపించారు. మోటార్ సైకిళ్ల తయారు చేస్తున్న ఉద్యోగులు, మహిళా సిబ్బందితో ముఖ్యమంత్రి మాట్లాడారు. తాము ఉత్పత్తి చేస్తున్న వాహనాల ప్రత్యేకతలను పవన్ ముంజాల్ వివరించారు. హీరో సంస్థ రూపొందించిన స్కూటీ కమ్ ఆటో వాహనాన్ని సీఎం ఆసక్తిగా పరిశీలించారు.












Click it and Unblock the Notifications