US Visa:సెప్టెంబర్ 15 నుంచి రూల్స్ ఛేంజ్! రెండు కీలక ఫారమ్‌లలో మార్పులు..
అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడాలని, ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయ విద్యార్థులు, నిపుణులకు అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ (USCIS) అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన రెండు ప్రధాన ఫారమ్‌లలో సెప్టెంబర్ 15 నుంచి భారీ మార్పులు రాబోతున్నాయి. ఎలాంటి గ్రేస్ పీరియడ్ ఇవ్వకుండానే కొత్త నిబంధనలను పక్కాగా అమలు చేయాలని యూఎస్‌సీఐఎస్ నిర్ణయించింది. దీంతో వేలాది మంది ఇండియన్ దరఖాస్తుదారులపై ఈ ప్రభావం పడనుంది.
రెండు కీలక ఫారమ్‌లలో మార్పులు.. నిర్లక్ష్యం వహిస్తే రిజెక్షనే!
అమెరికాలో తమ వీసా గడువు పెంపు (Extension), వీసా కేటగిరీ మార్పు (Change of Status) కోసం ఉపయోగించే 'ఫారమ్ I-539'తో పాటు, వర్క్ పర్మిట్ (EAD) కోసం దాఖలు చేసే 'ఫారమ్ I-765'లను పూర్తిగా అప్‌డేట్ చేశారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఈ రెండింటికి సంబంధించి కొత్త వెర్షన్ ఫారమ్‌లను మాత్రమే అధికారులు స్వీకరిస్తారు. పాత ఫారమ్‌లలో దరఖాస్తులు పంపితే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తిరస్కరిస్తామని స్పష్టం చేశారు.

భారతీయులపై పడనున్న ప్రత్యక్ష ప్రభావం!
ఈ కొత్త మార్పు ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థులు, ఐటీ నిపుణులు, ఎక్స్చేంజ్ విజిటర్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికాలో చదువు పూర్తి చేసుకుని వర్క్ పర్మిట్ కోసం ఎదురుచూసే విద్యార్థులకు, అలాగే వీసా స్టేటస్ మార్చుకోవాలనుకునే వారికి ఈ రెండు ఫారమ్‌లు అత్యంత కీలకం. దరఖాస్తు పంపే సమయంలో ఫారమ్ అడుగున ఉన్న 'ఎడిషన్ డేట్' (Edition Date) సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోవడం ఇప్పుడు తప్పనిసరిగా మారింది.
ఏ తేదీన ఏ ఫారమ్ వాడాలో తెలుసా?
సెప్టెంబర్ 15 కంటే ముందు దరఖాస్తు చేసుకునే వారు ఫారమ్ I-539 కోసం 'ఆగస్టు 28, 2024' వెర్షన్‌ను, ఫారమ్ I-765 కోసం 'ఆగస్టు 21, 2025' వెర్షన్‌ను ఉపయోగించవచ్చు. అయితే సెప్టెంబర్ 15 లేదా ఆ తర్వాత దరఖాస్తు దాఖలు చేసేవారు మాత్రం కచ్చితంగా 'సెప్టెంబర్ 15, 2026' అని రాసి ఉన్న కొత్త ఎడిషన్ ఫారమ్‌లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక రోజు తేడా వచ్చినా అప్లికేషన్ చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది.
ముందే అప్లై చేసినా చిక్కే.. అధికారుల ముఖ్య సూచన!
యూఎస్‌సీఐఎస్ ఇప్పటికే కొత్త ఫారమ్‌ల నమూనాలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అయితే సెప్టెంబర్ 15వ తేదీ కంటే ముందే కొత్త ఫారమ్‌లను పూర్తి చేసి పంపకూడదని అధికారులు స్పష్టం చేశారు. నిర్దేశిత తేదీకి ముందే కొత్త వెర్షన్ పంపినా, లేదా గడువు దాటిన తర్వాత పాత వెర్షన్ పంపినా దరఖాస్తులు రిజెక్ట్ అవుతాయి. కాబట్టి అమెరికా వీసా, వర్క్ పర్మిట్ దరఖాస్తుదారులు తేదీల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం.














Click it and Unblock the Notifications