మొత్తానికి బెంగళూరు పరువు నిలిచింది..!!
ఇండియన్ సిలికాన్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బెంగళూరు.. తన పేరును మరోసారి సార్థకం చేసుకుంది. తన సత్తా చాటుకుంది. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిటీ ఇండెక్స్‌లో 26వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో శరవేగంగా పురోగమిస్తోన్న నగరాలపై నిర్వహించిన సర్వేలో తొలి 30 స్థానాల్లో నిలిచింది.
దేశంలో ఇతర నగరాలతో పోల్చుకుంటే బెంగళూరుది అగ్రస్థానం. దీనికంటే ముందు- భారత్ లోని మరే నగరం కూడా లేదు. మార్కెట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నిర్వహించిన సర్వే ఇది. దీని ప్రకారం- AI రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డేటా సెంటర్ల విషయంలో దేశంలో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది.

'2025 AI సిటీ ఇండెక్స్' ప్రకారం- అనేక భారతీయ నగరాలు ప్రపంచ ర్యాంకింగ్‌లలో వేగంగా పురోగమిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న AI హబ్‌లలో బెంగళూరుతో పాటు రియాద్, హాంగ్జౌ, సావో పాలో నగరాలు ఉన్నాయి. భారత్ లో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కత ఉన్నాయి.
బెంగళూరులో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ ఎకోసిస్టమ్ ద్వారా గణనీయమైన విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే దీనికి కారణమని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గ్లోెబల్ ఆర్ అండ్ డీ, డేటా సెంటర్ హబ్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందీ సిటీ.
మరోవైపు- ముంబై, ఢిల్లీ ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా భద్రతలో వినూత్నంగా AIని వినియోగిస్తున్నాయి. భవిష్యత్ ర్యాంకింగ్‌లలో ఈ నగరాలు మరింత పైకి దూసుకుపోతాయని అంచనా వేస్తున్నారు. భారతీయ నగరాలు AI సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలంటే- మరింత సమగ్రమైన రోడ్ మ్యాప్, పటిష్టమైన నియంత్రణ వ్యవస్థ అవసరమని ఈ రిపోర్ట్ అభిప్రాయపడింది.
ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత సియోల్, బీజింగ్, దుబాయ్, శాన్‌ఫ్రాన్సిస్కో వరుసగా టాప్ 5లో ఉన్నాయి. సింగపూర్ ఈ స్థాయిలో నిలవడానికి ఏఐ స్టార్టప్ ఎకో సిస్టమ్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాలలో బలమైన ప్రభుత్వ-ప్రైవేట్ సహకారం ఉండటమేనని ఈ నివేదిక తెలిపింది.
సూపర్ కంప్యూటింగ్‌లో గణనీయమైన పెట్టుబడులతో, రాబోయే సంవత్సరాలలో అమెరికా, చైనా మధ్య అంతరం తగ్గుతుందని నివేదిక అంచనా వేసింది. పరిశ్రమల పరంగా- మైక్రోసాఫ్ట్ అత్యంత చురుకైన సంస్థగా నిలిచింది. అది తన AI డేటా సెంటర్ ను మరింత విస్తరించడం కలిసి వచ్చింది.












Click it and Unblock the Notifications