విమానాశ్రయాల భద్రతపై కేంద్రం సంచలన నిర్ణయం?

దేశంలో విమానాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి, ప్రయాణికుల రద్దీని క్రమబద్దీకరించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించనుంది. ఫేషియల్ రికగ్నిషన్, సీసీటీవీ కెమెరాల అనుసంధానం, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు, ఫాస్టాగ్‌ లింకేజ్ వంటి చర్యలను పరిశీలిస్తోంది.

విమానాశ్రయ భద్రతపై సీఐఎస్‌ఎఫ్ వర్క్‌షాప్

ఈ నెల 27న ఢిల్లీలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నిర్వహించిన ఎయిర్‌పోర్ట్ సెక్టార్ ఫంక్షనల్ వర్క్‌షాప్ లో ఈ అంశాలపై చర్చించారు. ఈ వర్క్‌షాప్‌లో విమానయాన మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) అధికారులు పాల్గొన్నారు.

వారితోపాటు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (BOI), ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), ఢిల్లీ పోలీసులు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులు, సీఐఎస్‌ఎఫ్ భద్రత కల్పిస్తున్న 69 విమానాశ్రయాల చీఫ్ సెక్యూరిటీ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఐఎస్‌ఎఫ్ ప్రతినిధి మాట్లాడుతూ.. విమానాశ్రయ భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు, మరింత సమర్థవంతంగా, ప్రయాణికులకు అనుకూలంగా మార్చేందుకు ఈ వర్క్‌షాప్ దోహదపడుతుందని అన్నారు.

చెక్ పాయింట్ల వద్ద రద్దీ తగ్గించేందుకు చర్యలు

విమానాశ్రయ ఎంట్రీ పాస్‌లను ఫేషియల్ రికగ్నిషన్, సీసీటీవీ కెమెరాలతో అనుసంధానం చేయడం, వాహనాల కోసం ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు, ఫాస్టాగ్‌లను అనుసంధానం చేయడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. దీనివల్ల ఎయిర్ పోర్టుల్లోకి ప్రవేశించడం మరింత సులభతరమౌతుంది.

భద్రతా తనిఖీలు త్వరగా పూర్తవుతాయి. తద్వారా క్యూలు, నిరీక్షణ సమయం తగ్గుతుంది. డిజిటలైజ్డ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వల్ల సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేయవచ్చు.

విమానాశ్రయ ఎంట్రీ పాస్ లను సెక్యూరిటీ సిబ్బందికి జారీ చేస్తుంటారు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఎంట్రీ, ఎగ్జిట్ సమయంలో వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. కొన్ని విమానాశ్రయాలలో సిబ్బంది, ప్రయాణికులు ఒకే గేటును ఉపయోగించడం వల్ల రద్దీ ఏర్పడుతోంది.

ఫలితంగా- ప్రయాణికులను విమానాశ్రయంలోకి అనుమతించడంలో ఆలస్యం జరుగుతోందని ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫేషియల్ రికగ్నిషన్ విధానంతో ఎంట్రీ పాస్ లను అనుసంధానం చేయడం వల్ల క్యూలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.

సిబ్బందికి శిక్షణ

విమానాశ్రయ సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, ఎయిర్‌లైన్ సిబ్బందికి ఒకే విధమైన శిక్షణ ఇవ్వడంపై కూడా వర్క్‌షాప్‌లో చర్చించారు. దీనివల్ల ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుతాయి. విమాన ప్రయాణాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని చిన్న నగరాల్లో మరిన్ని ఏవియేషన్ సెక్యూరిటీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తోన్నట్లు డీజీసీఏ అధికారులు చెబుతున్నారు.

వీఐపీ భద్రతకు ప్రాధాన్యం

విమానాశ్రయాలలో వీఐపీ భద్రతను పెంచడం గురించి కూడా ఈ సదస్సులో చర్చించారు. అత్యాధునిక యాంటీ-డ్రోన్లు, రోబోటిక్ సెక్యూరిటీ వంటి సాధనాలను ఉపయోగించాలని నిర్ణయించారు. లేయర్డ్ ప్రొటెక్షన్ కాన్సెప్ట్ ద్వారా సాధారణ విమానాశ్రయ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా వీఐపీలకు పూర్తి భద్రత కల్పించవచ్చని సంబంధిత అధికారి తెలిపారు.

దేశంలోని పౌర విమానయాన రంగంలోని వాటాదారులు భద్రతాపరమైన నష్టాలను ముందుగా గుర్తించడానికి కృత్రిమ మేధస్సు (AI)ను ఉపయోగించి డేటా విశ్లేషణ చేయాలని కూడా చర్చించారు. దీనివల్ల విమానాశ్రయాలలో భద్రతా చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకుండా స్మార్ట్ సెక్యూరిటీ చెక్‌లు నిర్వహించవచ్చునని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+