రైతులకు పండగలాంటి వార్త.. తెలంగాణలో ఏఐ ల్యాబ్.. ఎక్కడో తెలుసా..?
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ట్రెండ్ నడుస్తోంది. అన్ని రంగాల్లోకి ఏఐ చొచ్చుకొస్తోంది. మానవులకు అనితర సాధ్యం కాని ఎన్నో క్లిష్టమైన సమస్యలకు ఏఐ పరిష్కారం చూపుతోంది. ఈ క్రమంలో ఏఐను వ్యవసాయ రంగంలోనూ వినియోగించి రైతులకు మేలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది.
వ్యవసాయంలో అనేక సంక్లిష్టమైన సమస్యలు ఉంటాయి. ఏ విత్తనం వేయాలి.. ఏ పురుగుల మందు కొట్టాలి.. ప్రతి విషయంలో ఎంతో అనుభవం ఉంటే తప్ప సాధ్యం కాదు. అయితే వ్యవసాయంలో రైతులకు సాయం చేసే దిశగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ఏఐ ఆధారిత ల్యాబ్ ను ఏర్పాటు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.
వ్యవసాయంలోని అనేక రకాల సమస్యలను ఏఐ సాంకేతికత ఆధారంగా అధిగమించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ల్యాబ్ ద్వారా వ్యవసాయ రంగంలో విస్తృతంగా డ్రోన్ లు, రోబోలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది. ఈ ల్యాబ్ లో నిరంతరం పరిశోధనలు జరిపి రైతులకు వ్యవసాయంతో పాటు ఏ పంట వేస్తే లాభాలు వస్తాయి.. ఇలా ప్రతి దానిని ఏఐ సాంకేతికత ఆధారంగా రైతులకు అండగా నిలిచేందుకు కృషి చేస్తామని పేర్కొంది.

ఇప్పటికే వ్యవసాయ రంగంలో డ్రోన్ ల వినియోగం పెరిగింది. పురుగు మందుల పిచికారీ, విత్తనాలు చల్లడంలో డ్రోన్ లను వినియోగిస్తున్నారు రైతులు. అయితే వీటి వినియోగాన్ని మరింత సమర్థవంతంగా పెంచేందుకు ఏఐ ల్యాబ్ ద్వారా పలు విభాగాల్లో పరిశోధనలు జరిపేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలోని శాస్త్రవేత్తలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ యూనివర్సీటీలో ఏఐ ల్యాబ్ ను ఏర్పాటు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.












Click it and Unblock the Notifications