ఏటీఎమ్ సెక్యూరిటీ గార్డు దారుణ హత్య, లారీని ఢీకొన్న బస్సు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షామీర్ పెట్ మండలం హకీంపేట ప్రాంతంలో యాక్సెస్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డు దారుణ హత్యకు గురైన సంఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం హకీంపేటకు చెందిన బాలరాజు గౌడ్ (55) కుటుంబసభ్యులతో కలిసి బస్ డిపో కాలనీలో నివసిస్తున్నాడు.

ఇంటి సమీపంలోని యాక్సెస్ బ్యాంకు ఏటీఎమ్ వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. విధులక హాజరైన బాలరాజ్ గౌడ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. ఘటనాస్ధలంలో ఎలాంటి దొంగతనం జరిగినట్లు ఆనవాలు లేవని పోలీసులు తెలిపారు. ఆల్వాల్ ఏసీపీ సయ్యద్ రఫి ఘటనాస్ధలిని పరిశీలించి... కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లారీని ఢీకొన్న బస్సు
విజయవాడ నుంచి హైదరాబాదుకు వస్తున్న ప్రియాంక ట్రావెల్స్ బస్సు (ఏపీ 10 వీ 2255) నేటి తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. హయత్ నగర్ మండలం పరిధిలోని అంబర్ పేట వద్ద ఈ ప్రమాదం సంభవించింది.
ఘటనలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 14 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. లారీ టైర్ పంక్చర్ కావడమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది.












Click it and Unblock the Notifications