దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..!
సినిమా ప్రపంచం కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాదు... సమాజంపై ప్రభావం చూపించే శక్తిని కూడా కలిగి ఉంటుంది. ఆ భావనను కార్యరూపంలో చూపిస్తూ ముందుకు సాగుతున్న నిర్మాణ సంస్థగా "వ్రిద్ధి సినిమాస్" ప్రత్యేక గుర్తింపును సంపాదిస్తోంది. ఈ సంస్థ అధినేత, నిర్మాత కిలారు వెంకట సతీష్ సామాజిక సేవలో చూపిస్తున్న చొరవ ఇప్పుడు టాలీవుడ్‌లో ప్రశంసలు అందుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ నిర్వహించిన కార్యక్రమంలో వ్రిద్ధి సినిమాస్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు 21 ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. మంత్రి గొట్టిపాటి చేతుల మీదుగా ఈ ట్రై సైకిళ్లు లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. "సినిమా నిర్మాణంతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవడం అభినందనీయం. వ్రిద్ధి సినిమాస్ అధినేత వెంకట సతీష్ కిలారు నిజంగా ఆదర్శం" అని ప్రశంసించారు.

ఇక సినిమాల విషయానికి వస్తే... వ్రిద్ధి సినిమాస్ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'పెద్ది' ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
అంతేకాకుండా నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఎన్‌బీకే 111 చిత్రాన్ని కూడా వ్రిద్ధి సినిమాస్ నిర్మించడం విశేషం. ఓ వైపు వ్రిద్ధి సినిమాస్ నిర్మిస్తున్న చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుండగా.. మరోవైపు సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరింత గౌరవాన్ని తెచ్చిపెడుతున్నాయి. నిర్మాత కిలారు వెంకట సతీష్ తీసుకుంటున్న ఈ ద్వంద్వ బాధ్యత ఆయనను కేవలం నిర్మాతగానే కాకుండా సమాజానికి అండగా నిలిచే వ్యక్తిగా నిలబెడుతోంది.
మొత్తంగా చూస్తే, వ్రిద్ధి సినిమాస్ తీసుకున్న దిశ "సినిమా అంటే కేవలం తెరమీద కథ కాదు... సమాజంలో మార్పు తీసుకురాగల శక్తి" అనే భావనను మరోసారి గుర్తు చేస్తోంది. నిర్మాత కిలారు వెంకట సతీష్ వినోదం , సామాజిక బాధ్యత అనే రెండు మార్గాలను సమన్వయం చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. వరుసగా భారీ ప్రాజెక్టులతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండటం ద్వారా ఈ సంస్థ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది.












Click it and Unblock the Notifications