జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోను నేను చూడలేదు: నయనతార ప్రశంసల వర్షం
దక్షిణాది చిత్రపరిశ్రమలో 'లేడీ సూపర్ స్టార్'గా వెలిగిపోతున్న నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన ఈ బ్యూటీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో మన టాలీవుడ్ మాస్ కా దాస్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తారక్ డ్యాన్స్, ఆయనలోని హ్యూమర్ సెన్స్ గురించి నయన్ పంచుకున్న జ్ఞాపకాలు అభిమానులను ఖుషీ ఖుషీ చేస్తున్నాయి.
ఎన్టీఆర్ స్పీడు చూసి షాకయ్యాను..
నయనతార మాత్రం తారక్ డ్యాన్స్ వెనుక ఉన్న ఒక ఆశ్చర్యకరమైన నిజాన్ని బయటపెట్టింది. "చాలా మంది హీరోలు డ్యాన్స్ కోసం గంటల తరబడి రిహార్సల్స్ చేస్తారు. కానీ నేను చూసిన ఏకైక హీరో ఎన్టీఆర్.. ఆయన రిహార్సల్స్ అనేవే చేయరు. కొరియోగ్రాఫర్ స్టెప్ చూపిస్తే చాలు, ఒక్కసారి చూసి నేరుగా టేక్‌కు వెళ్ళిపోతారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్ల కంటే అద్భుతంగా ఆ మూమెంట్స్ చేస్తారు. తెరపై ఆయన స్పీడ్ చూసి నేను షాకయ్యాను" అంటూ తారక్ ప్రతిభను ఆకాశానికెత్తేసింది నయన్.

కేవలం డ్యాన్స్ మాత్రమే కాదు, సెట్‌లో ఎన్టీఆర్ ఎంత సరదాగా ఉంటారో ఒక ఉదాహరణతో వివరించింది నయనతార. "అదుర్స్ షూటింగ్ సమయంలో నేను మేకప్ రూమ్ లో టచ్-అప్ చేసుకుంటుంటే, తారక్ అక్కడికి వచ్చి నన్ను ఆటపట్టించేవారు. 'ఎందుకంత మేకప్? అంత టచ్-అప్ అవసరమా? ఎలాగో స్క్రీన్ మీద అందరూ నన్నే చూస్తారు, నిన్ను ఎవరూ చూడరు!' అని నవ్వుతూ అనేవారు" అంటూ సరదాగా చెప్పారు.
అసలు తారక్ రిహార్సల్సే చేయరు..
తారక్ అసలు రిహార్సల్స్ చేయరని చెప్పిన నయనతార, చివర్లో ఒక ఆసక్తికరమైన పాయింట్ జోడించింది. "అంతటి అసాధ్యుడైన ఎన్టీఆర్ చేత కూడా రాజమౌళి మాత్రమే 'నాటు నాటు' పాట కోసం అన్ని సార్లు ప్రాక్టీస్ చేయించగలరు. ఆయన పట్టుదల అలాంటిది" అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. 'అదుర్స్' సినిమాలో బ్రాహ్మణ పాత్రలో తారక్, 'చంద్రకళ'గా నయనతార పండించిన వినోదం అంతా ఇంతా కాదు.
ముఖ్యంగా బట్టు పాత్రలో బ్రహ్మానందం - చంద్రకళ కాంబినేషన్ లో వచ్చే సీన్లు ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. తన పాత్రపై వస్తున్న ఈ మీమ్స్ చూసి తను కూడా ఎంతో ఆశ్చర్యపోతానని, ఆ సినిమా తన కెరీర్ లో ఒక ప్రత్యేకమైన జ్ఞాపకమని నయన్ వెల్లడించింది.












Click it and Unblock the Notifications