రూ.7 కోట్లు ఖర్చుపెడితే రూ.2,240 కోట్లు వచ్చాయి
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి వందల కోట్లు పెట్టి, భారీ స్టార్ కాస్టింగ్‌తో తీసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతుంటాయి. కానీ, 'కంటెంట్ ఈజ్ కింగ్' అని నమ్మి, బలమైన కథతో వస్తే ప్రేక్షకులు ఎలాంటి బ్రహ్మరథం పడతారో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' నిరూపించింది. కేవలం రూ.7 కోట్ల అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.
ప్రఖ్యాత 'బాక్స్ ఆఫీస్ మోజో' లెక్కల ప్రకారం, ఈ చిత్రం విడుదలైన కేవలం 26 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 2,240 కోట్లు కొల్లగొట్టింది. హారర్ జానర్‌లో ఇంత తక్కువ బడ్జెట్‌తో వచ్చి, ఈ స్థాయి వసూళ్లు సాధించడం ఒక అరుదైన రికార్డు. 'ఫోకస్ ఫీచర్స్' స్టూడియో చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'అబ్సెషన్' సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఇండియన్స్ ఫిదా అయ్యారు
సాధారణంగా భారీ గ్రాఫిక్స్ ఉన్న హాలీవుడ్ యాక్షన్ సినిమాలు ఇండియాలో భారీ వసూళ్లు సాధిస్తుంటాయి. కానీ, ఒక చిన్న హారర్ థ్రిల్లర్ సినిమాకు భారతీయ ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. ఈ సినిమా ఇండియాలో ఏకంగా రూ. 78 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇందులో ఒక్క కర్ణాటక నుంచే రూ. 20 కోట్లకు పైగా వాటా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం రూ. 12 కోట్ల కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా ఈ సినిమా క్లైమాక్స్ గురించిన చర్చలు, మీమ్స్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
దర్శకుడే ఆశ్చర్యపోతున్నాడు
ఈ అద్భుతమైన సక్సెస్ చూసి చిత్ర దర్శకుడు కర్రీ బార్కర్ స్వయంగా ఆశ్చర్యపోతున్నారు. తాము ఈ సినిమాను చాలా పరిమితమైన వనరులతో, చిన్న స్థాయిలో తీశామని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడైనా ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని తాను అస్సలు ఊహించలేదని, ముఖ్యంగా భారత్ లాంటి దేశంలో లభించిన ఆదరణ చూస్తుంటే మాటలు రావడం లేదని తన ఆనందాన్ని పంచుకున్నారు. సినిమా విజయానికి కావాల్సింది వందల కోట్ల బడ్జెట్ కాదు, ప్రేక్షకుడిని థియేటర్లలో సీట్లకు అతుక్కుపోయేలా చేసే బలమైన కథనం మాత్రమేనని ఈ చిత్రం మరోసారి నిరూపించింది.












Click it and Unblock the Notifications