నేటి టిఎస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు సర్వం సిద్ధం..|
నేడే టిఎస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. గ్రూప్ 1 ప్రాథమిక పరీక్షకు సర్వం సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. నేడు (ఆదివారం) ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగనుంది. ఈ పరీక్షకు అప్లయ్ చేసుకున్న విద్యార్థులంతా ఉదయం 10 గంటలలోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.
ఈ సారి తెలంగాణలో జరగబోయే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించనున్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది జరగబోయే టిఎస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కు మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇలాంటి పరీక్షలపై పేపర్ లీకేజీ ఘటనలు వెలుగుచూసిన క్రమంలో ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు పలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 897 పరీక్షా కేంద్రాలకు ప్రత్యేక బస్సులను నడపాలని TGSRTC ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ప్రత్యేక బస్సులు..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4.03 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతుండగా, అందులో గ్రేటర్ హైదరాబాద్‌లోనే దాదాపు 1.70 లక్షల మంది రాస్తున్నట్లు సమాచారం. వారికీ రవాణాపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రద్దీకి అనుగుణంగా సిటీ బస్సులను అందుబాటులో ఉంచేందుకు తగు ఏర్పాట్లు చేసినట్లు ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్లలో 'May I Help You' కౌంటర్లను కూడా ఏర్పాట్లు చేశారు. అక్కడ పరీక్షా కేంద్రాల సమాచారాన్ని అభ్యర్థులకు ఇవ్వడంతో పాటు ఏ బస్సులో ప్రయాణించాలో కూడా అభ్యర్థులకు అధికారులు సూచిస్తారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ పాయింట్లలో అధికారులు తగు ఏర్పాట్లను చేశారు. ఆయా ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో ప్రత్యేక అధికారులను కూడా నియమించారు.












Click it and Unblock the Notifications