అన్ని సబ్జెక్టులకు ఒకే పాఠ్యపుస్తకం - అబ్సెంట్ అయితే, ఇక..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. విద్యా శాఖలో ఇప్పటికే సంస్కరణల దిశగా కసరత్తు జరుగుతోంది. ఇంటర్ సిలబస్.. పరీక్షల విధానంలో మార్పుల కోసం అభిప్రాయ సేకరణ చేస్తోంది. ఇదే సమయంలో విద్యార్ధులకు పుస్తకాల బరువు తగ్గించేందుకు కొత్త ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే పాఠ్యపుస్తక విధానం అందుబాటు లోకి తీసుకురావాలని నిర్ణయించారు. అదే విధంగా విద్యార్ధుల హాజరు పైన కఠినంగా ఉండేలా నిర్ణయాలు ప్రకటించనున్నారు.
ఒకే పాఠ్యపుస్తకం
విద్యార్ధుల పై ఒత్తిడి లేని విద్యా విధానం అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా పుస్తకాల బరువు పైన ఫోకస్ చేసింది. కొత్త ప్రతిపాదనల పైన చర్చ సాగుతోంది. పుస్తకాల మోతకు స్వస్తి పలకాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రణాళికలు సిద్దమయ్యాయి. వచ్చే ఏడాది నుంచి సెమిస్టర్ల వారీగా అన్ని పుస్తకాలను కలిపి ఒకే పాఠ్యపుస్తకంగా తీసుకురావాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఒకటి, రెండు తరగతులకు సంబంధించి మొదటి సెమిస్టర్‌లో అన్ని సబ్జెక్టులను కలిపి కేవలం ఒకే పాఠ్యపుస్తకంగా తీసుకురానున్నారు.

కీలక మార్పులు
ఒకే పాఠ్యపుస్తకం అమలు పైన ఇప్పటికే నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. దీంతో పాటుగా
మరో వర్క్‌బుక్ సైతం ఉంటుంది. ఇక రెండో సెమిస్టర్‌లోనూ అన్ని సబ్జెక్టులకు కలిపి ఒక పాఠ్యపుస్తకంగా ఇస్తారు. అలాగే వర్క్‌బుక్ ఉంటుంది. 3-5 తరగతులకు మొదటి సెమిస్టర్‌లో భాష సబ్జెక్టులు అన్నీ కలిపి ఒక పుస్తకం, వర్క్‌బుక్, ఇతర సబ్జెక్టులన్నీ కలిపి మరో పుస్తకం, వర్క్‌బుక్ ఇవ్వాలని నిర్ణయించారు 9, 10 తరగతుల్లో ప్రస్తుతం ఉన్న హిందీ పాఠ్యపుస్తకాన్ని తొలగించి, రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి రూపొందించిన పాత పుస్తకాన్ని తీసుకు రావాలని నిర్ణయం తీసుకున్నారు.
గైర్హాజరు అయితే
అదే విధంగా విద్యార్ధుల హాజరు విషయంలోనూ కొత్త విధానం అమలు చేయనున్నారు. ఇకపై ఉపాధ్యాయులు అనుమతి లేకుండా గైర్హాజరయితే వారికి బదిలీల సమయంలో నెలకో పాయింట్ చొప్పున గరిష్ఠంగా 10 మైనస్ పాయింట్లు ఇస్తారు. ప్రస్తుత సంక్రాంతి సెలవులు పూర్తయ్యేలోపు ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో వివరాలను నవీకరించుకోవాలని నిర్దేశించారు. ఉపాధ్యాయుల బదిలీ లకు ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ప్రతీ ఏడాది ఏప్రిల్, మే నెలల్లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది.












Click it and Unblock the Notifications