అభ్యర్థులకు షాక్: ఫిబ్రవరి 23న జరగాల్సిన Exam వాయిదా
కేంద్ర సాయుధ పోలీసు దళాలు (CAPFs), ప్రత్యేక భద్రతా దళం (SSF), అలాగే అస్సాం రైఫిల్స్‌లో ఖాళీగా ఉన్న మొత్తం 25,487 కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఫిబ్రవరి 23న నిర్వహించాల్సిన రాత పరీక్షను Staff Selection Commission (SSC) వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటించింది.
అధికారుల ప్రకటన ప్రకారం, పరీక్షకు కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/ ను తరచుగా పరిశీలించాలని సూచించారు. పరీక్ష తేదీ ప్రకటించిన తర్వాత, పరీక్షకు 8 నుంచి 10 రోజుల ముందు 'సిటీ ఇంటిమేషన్ స్లిప్'ను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ స్లిప్ ద్వారా అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రం ఉన్న నగరాన్ని ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది.

Exam అడ్మిట్ కార్డులు
అదేవిధంగా, పరీక్షకు 2 నుంచి 3 రోజుల ముందు అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది. అడ్మిట్ కార్డు లేకుండా పరీక్ష కేంద్రంలో ప్రవేశం ఉండదని, అందువల్ల అభ్యర్థులు సమయానికి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.
ఈ నియామక ప్రక్రియ ద్వారా CAPFs, SSF మరియు Assam Rifles లో కానిస్టేబుల్ (జీడీ) పోస్టులు భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వాయిదా కారణంగా కొంత నిరాశ వ్యక్తమైనప్పటికీ, కొత్త తేదీ త్వరలో ప్రకటించనున్నట్లు చెప్పడంతో అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది.
SSC వెబ్‌సైట్‌ను మాత్రమే నమ్మాలి..
అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ వివరాలను సిద్ధంగా ఉంచుకుని, అధికారిక ప్రకటనల కోసం SSC వెబ్‌సైట్‌ను మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియా వదంతులను విశ్వసించవద్దని అధికారులు సూచిస్తున్నారు.
పరీక్షా షెడ్యూల్, సిలబస్, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications