ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే గేమ్ ఛేంజర్ భోగాపురం ఎయిర్ పోర్ట్!
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఏపీ సర్కార్ అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తుంది. మంత్రులు భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తూ ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే ఎయిర్ పోర్ట్ అవుతుందని చెప్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ ప్రాంత రాజకీయ, ఆర్థిక, పర్యాటక వృద్ధికి ప్రధాన చిరునామాగా మారనుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం ప్రస్ఫుటించేలా ఏర్పాట్లు
ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం కానుందని ఆయన అన్నారు. నేడు మంత్రులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎయిర్‌పోర్ట్ లోపల ఏర్పాటు చేసిన సాంస్కృతిక కట్టడాలు, కళాకృతులను ఆసక్తిగా చూశారు. అనంతరం టెర్మినల్ భవనంలో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం ప్రస్ఫుటించేలా చేసిన ఏర్పాట్లను మంత్రి దుర్గేష్ కొనియాడారు.

అభివృద్ధికి రెక్కలు వచ్చినట్లుగా ఉంది
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ..అభివృద్ధికి రెక్కలు వచ్చినట్లుగా, ఉత్తరాంధ్రకు గ్లోబల్ లుక్ వచ్చేలా ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయన్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ ఆవరణలో ఏర్పాటు చేసిన బొబ్బిలి వీణలు, కూచిపూడి నృత్య భంగిమలు, ఏటికొప్పాక బొమ్మలు, తోలుబొమ్మలాట చిత్రాలు, కలంకారీ పెయింటింగ్స్ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవానికి అద్దంపట్టేలా ఉన్నాయన్నారు.
అడుగడుగునా ఆంధ్రా వైభవం
ఆంధ్రా వైభవం అడుగడుగునా కనిపిస్తుందన్నారు. ప్రత్యేకించి శ్రీశైలం, తిరుమల, లేపాక్షి నంది వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, మన్యం అందాలను చాటిచెప్పే డిజిటల్ స్క్రీన్‌లు, వాల్ పెయింటింగ్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉందని అభినందించారు.'ఫ్లైయింగ్ ఫిష్' ఆకారంలో రూపొందించిన టెర్మినల్ డిజైన్, విద్యుద్దీపాలంకరణతో అత్యంత సుందరంగా ఉందన్నారు.
ఆధునిక వసతులతో ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి అనుభూతి
ఎయిర్‌పోర్టులోని ఏరో బ్రిడ్జ్, ఏరో ట్రాఫిక్ కంట్రోల్ టవర్, రన్‌వే, టాక్సీవేలు, ఏప్రాన్ ప్రాంతాలు, అప్రోచ్ రోడ్లను మంత్రి దుర్గేష్ నిశితంగా పరిశీలించారు. హైస్పీడ్ సెక్యూరిటీ స్కానింగ్, ఫాస్ట్ డిజిటల్ చెక్-ఇన్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ ఇ-గేట్స్, విశాలమైన పార్కింగ్ స్థలాలు, ఎస్క్ లేటర్లు, ఎలివేటర్లు వంటి ఆధునిక వసతులు ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి అనుభూతిని అందిస్తాయని తెలిపారు.
ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు
విశాఖ రైల్వే జోన్‌తో పాటు భోగాపురం ఎయిర్‌పోర్టు ద్వారా కేంద్ర సహకారంతో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి పెద్దపీట వేసిందని మంత్రి తెలిపారు. ఈ విమానాశ్రయం వల్ల ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు, పెట్టుబడులు తరలివస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.పర్యాటకం, విమానయాన, పారిశ్రామిక రంగాలలో విపరీతమైన అవకాశాలు పెరుగుతాయన్నారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే గేమ్ చేంజర్
ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే గేమ్ చేంజర్ ఈ ఎయిర్ పోర్ట్ అన్నారు. ఇది ఏపీకి గ్లోబల్ ఇమేజ్ తీసుకొస్తుందని మంత్రి దుర్గేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న 'థింసా' నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని వెల్లడించారు. ఆగస్టు 1న జరగనున్న ఈ చారిత్రాత్మక ఘట్టంలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు.













Click it and Unblock the Notifications