గ్రూప్-4 పరీక్షలకు బయోమెట్రిక్ తప్పనిసరి: హాల్ టికెట్లు నేటి నుంచే డౌన్‌లోడ్ చేసుకోండి
హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-4 పరీక్ష జులై 1న జరగనున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి గ్రూప్-4 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ టీఎస్‌పీఎస్సీ ప్రకటన వెలువరించింది. దీంతో పేపర్-1, పేపర్-2 పరీక్షలకు అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్న తర్వాతే ఓఎంఆర్ పత్రాల్ని అందజేయనున్నారు.
గ్రూప్ 1 పరీక్షకు బయోమెట్రిక్ తీసుకోకుండా పరీక్ష నిర్వహించడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. హైకోర్టు కూడా ఈ విషయంపై టీఎస్‌పీఎస్సీని వివరణ కోరింది. ఈ క్రమంలో గ్రూప్ 4 పరీక్షలకు బయోమెట్రిక్ తప్పరిసరి చేసింది టీఎస్‌పీఎస్సీ. కాగా, శనివారం నుంచి గ్రూప్ -4 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.

టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. మొత్తం 8180 గ్రూప్ 4 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జులై 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని వివరించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి రెండు గంటల ముందే రావాలని.. చివరి నిమిషంలో హడావుడా ఇబ్బంది పడొద్దని సూచించారు.
హాల్‌టికెట్లను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోవాలని, చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇబ్బంది పడే ప్రమాదం ఉందని తెలిపారు. హాల్ టికెట్ వెనక భాగంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలన్నీ పొందు పరచామని, వాటికి తప్పక పాటించాలని సూచించారు.
ఒకే రోజు పరీక్ష నిర్వహిస్తుండటంతో జిల్లాకేంద్రాల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టీఎస్‌పీఎస్సీ సమావేశాలు నిర్వహించింది. రెండంచెల తనిఖీలు నిర్వహించనున్నారు. హాల్‌టికెట్‌తో పాటు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డును పరిశీలిస్తారు. దీనిలో భాగంగా హాజరుపట్టీలో ఫొటోను, అభ్యర్థి గుర్తింపు కార్డు, ముఖాన్ని సరిచూసి సంతకం, వేలిముద్ర తీసుకోనున్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులకు కమిషన్ స్పష్టం చేసింది. ఓఎంఆర్ పత్రాల్లో అభ్యర్థులు హాల్‌టికెట్ నంబరు, ప్రశ్నపత్రం కోడ్, పేరు, సంతకం పేర్కొనాల్సి ఉంటుందని తెలిపింది.












Click it and Unblock the Notifications