CBSE Exams: ఇక సీసీటీవీ పర్యవేక్షణలో ఎగ్జామ్స్.. సీబీఎస్ఈ బోర్డ్ సంచలన నిర్ణయం..
CBSE News: విద్యార్థులకు పరీక్షలు అనగానే ముందు వళుకు వస్తుంటుంది. బోర్డు ఎగ్జామ్స్ అనగానే ఎలాగైనా వాటిని క్లియర్ చేయాలని నేటితరం పిల్లలు ఆందోళన చెందుతున్నారు. పోటీ ప్రపంచంలో పెరుగుతున్న ఒత్తిడిని జయించేందుకు ఇప్పటికే వారు ఇబ్బందులు పడుతుండగా బోర్డులు మరిన్ని కొత్త నిబంధనలతో వస్తున్నాయి.
తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) పరీక్షల్లో పారదర్శకతను పెంచే దిశగా నిర్మయాలు తీసుకుంది. ఈ క్రమంలో 2025లో జరగనున్న 10, 12 తరగతి పరీక్షలను నిర్వహించే కేంద్రాల్లో పూర్తిగా CCTV నిఘా వ్యవస్థలను తప్పనిసరి చేసింది. పరీక్షల్లో అన్యాయమైన పద్ధతులను అడ్డుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు బోర్డు వెల్లడించింది. ఈ క్రమంలో దేశంలోని దాదాపు 8000 పరీక్షా కేంద్రాల్లో పనిచేసే సీసీకెమరాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనని బోర్డు తన అధికారిక నోటిఫికేషన్ లో వెల్లడించింది.

ఈ క్రమంలో పరీక్షా కేంద్రాల్లోనే పరీక్ష హాలు, ఎంట్రీ, ఎగ్జిట్, పరీక్షల సమయంలో విద్యార్థులు వేచి ఉండే ఇతర సంబంధిత స్థలాలు సర్వేలెన్స్ కింద ఉండాలని పేర్కొంది. జవాబుదారీతనం, పారదర్శకతను నిర్ధారించడానికి ఈ కెమెరాల నుంచి ఫుటేజ్ నిరంతరం రికార్డ్, స్టోర్ చేయనున్నట్లు బోర్డ్ పేర్కొంది. అలాగే వీటి నిర్వహణలో గోప్యతకు సంబంధించిన నిబంధనలను సైతం బోర్డు సదరు ఎగ్జామ్ సెంటర్లకు వెల్లడించింది. ఇకపై పరీక్షా కేంద్రాల్లో కెమెరాలు ఉంటాయని, వాటి పర్యవేక్షణలోనే ఎగ్జామ్స్ జరుగుతాయని పాఠశాలలు తమ సిబ్బందితో పాటు విద్యార్థులకు సైతం సమాచారం అందించాలని సీబీఎస్ఈ బోర్డ్ సూచించింది.
ఏదైనా అవకతవకలు జరిగినప్పుడు ముందుగా అధికారం ఇవ్వబడిన సిబ్బందికి మాత్రమే సీసీకెమెరా ఫుటేజ్ యాక్సెస్ అందేలా చూడాలని బోర్డు స్పష్టం చేసింది. ఇది పరీక్షల్లో జరిగే మోసాలు లేదా అవకతవకలను అరికట్టడానికి తోడ్పడుతుందని బోర్డు భావిస్తోంది. కొత్తగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయటం ద్వారా పరీక్షల సమయంలో మోసాలు, దుర్వినియోగం గురించి భయపడకుండా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలకు హాజరయ్యేందుకు సురక్షితమైన పరిస్థితులు సృష్టించాలని బోర్డు ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మెరుగైన పరీక్షణ నిర్వహణకు దారితీస్తుందని బోర్డు వెల్లడించింది.












Click it and Unblock the Notifications