కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లు: మీ పిల్లల పేరు ఉందో లేదో చూసుకోండి!
కేంద్రీయ విద్యాలయాల్లో (KV) తమ పిల్లలను చదివించాలని కలలుగనే వేలాది మంది తల్లిదండ్రుల నిరీక్షణకు తెరపడనుంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బాల్‌వాటిక, ఒకటో తరగతి ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో, ఇప్పుడు అందరి కళ్లు 'తాత్కాలిక ఎంపిక జాబితాల' (Provisional Selection Lists)పైనే ఉన్నాయి.
ఏప్రిల్ 8 నుంచి అదృష్ట పరీక్ష.. వెలువడనున్న తొలి జాబితా!
మార్చి 20 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకున్న విద్యార్థుల ఫలితాలు ఏప్రిల్ రెండో వారంలో విడుదల కానున్నాయి. బాల్‌వాటిక (1, 2, 3) మొదటి తాత్కాలిక ఎంపిక జాబితా ఏప్రిల్ 8, 2026న విడుదలవుతుంది. ఒకటో తరగతి అడ్మిషన్ల తొలి జాబితా ఏప్రిల్ 9, 2026న వెలువడుతుంది. ఎన్నికల నేపథ్యంలో అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో మాత్రం ఈ జాబితాలను ఏప్రిల్ 10న విడుదల చేస్తారు. ఈ జాబితాలలో ఎంపికైన వారితో పాటు వెయిటింగ్ లిస్ట్ అభ్యర్థుల వివరాలు కూడా ఉంటాయి.

దశలవారీగా ప్రవేశాలు: ఎవరికి ప్రాధాన్యత?
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ ప్రక్రియ ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది.
- మొదటి ప్రాధాన్యత: విద్యా హక్కు చట్టం (RTE) కింద దరఖాస్తు చేసుకున్న వారికి.
- రెండో దశ: సర్వీస్ ప్రయారిటీ కేటగిరీ (I,II) అభ్యర్థులకు.
- చివరిగా: మిగిలిన ఖాళీ సీట్లను ఇతర కేటగిరీలతో భర్తీ చేస్తారు.
ఒకవేళ మొదటి రౌండ్ తర్వాత సీట్లు మిగిలితే, రెండో జాబితాను ఏప్రిల్ 16న, మూడో జాబితాను ఏప్రిల్ 21న విడుదల చేస్తారు.
ఆఫ్‌లైన్ ప్రవేశాలు & రెండో నోటిఫికేషన్..
ఒకవేళ RTE, SC, ST, OBC (NCL) కేటగిరీల్లో తగినన్ని దరఖాస్తులు రాకపోతే, KVS ఏప్రిల్ 21న రెండో నోటిఫికేషన్ జారీ చేస్తుంది. దీనికోసం ఏప్రిల్ 22 నుంచి 26 వరకు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తారు. ఇక 2 నుంచి 10వ తరగతి వరకు (పదకొండో తరగతి మినహా) సీట్ల లభ్యతను బట్టి ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. వీటి ఫలితాలను ఏప్రిల్ 13న ప్రకటించి, ఏప్రిల్ 15-20 మధ్య అడ్మిషన్లు పూర్తి చేస్తారు.
పదకొండో తరగతి అడ్మిషన్లు ఎప్పుడు?
పదకొండో తరగతి ప్రవేశాలు పూర్తిగా CBSE పదవ తరగతి ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వచ్చిన 10 రోజుల్లోపు KV విద్యార్థులకు రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. వారు కాకుండా మిగిలిన విద్యార్థులకు (Non-KV students), సీట్లు ఖాళీగా ఉంటేనే అవకాశం దక్కుతుంది. పదకొండో తరగతి మినహా మిగిలిన అన్ని తరగతుల ప్రవేశాలకు జూన్ 30, 2026 ఆఖరి తేదీగా నిర్ణయించారు.












Click it and Unblock the Notifications