Education News: మారుతున్న విద్యార్థుల ధోరణి.. IIT మండి సర్వేలో విస్తుపోయే విషయాలు
Startups: ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా మంచి ఉద్యోగం సంపాదించవచ్చని, జీవితం బాగుంటుందని గతంలో భావించేవారు. కాలక్రమేణా ఉద్యోగాల వల్ల సాధించేది ఏమీ లేదనే అభిప్రాయానికి వచ్చారు. అందుకే చిన్నదైనా ఫర్వాలేదు కానీ సొంత వ్యాపారం కలిగి ఉండాలని పలువురు విద్యార్థి దశ నుంచే కలగంటున్నారు. దాన్ని సాకారం చేసుకునేందుకు పెట్టుబడిదారుల సాయంతో స్టార్టప్స్‌ను నెలకొల్పేందుకు అడుగులు వేస్తున్నారు.
దేశంలో బిజినెస్‌ల స్థాపన దిశగా పలువురు ఆలోచిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొదటి మూడు స్టార్టప్ గమ్యస్థానాలల్లో భారత్ ఒకటిగా వెలుగొందుతోంది. బెంగళూరు, ఢిల్లీ మరియు ముంబైతో సహా వివిధ భారతీయ నగరాలు అంతర్జాతీయ అగ్ర స్టార్టప్ సిటీస్‌గా ఖ్యాతి గడించాయి. ఈ విషయంపై పరిశోధన నిర్వహించిన IIT మండి తాజాగా తన నివేదికను విడుదల చేసింది.

గ్లోబల్ యూనివర్శిటీ ఎంట్రప్రెన్యూరియల్ స్పిరిట్ స్టూడెంట్స్ సర్వే (GUESSS) ప్రకారం.. పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (DPIIT)లో 1.40 లక్షల కంటే ఎక్కువ స్టార్టప్‌లు నమోదయ్యాయి. ఆ విధంగా చూస్తే కొత్త ఆవిష్కరణలు మరియు వ్యాపారాల స్థాపనతో ఇండియా తన ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటోందని అర్థమవుతోంది.
14 శాతం భారతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ ముగిసిన వెంటనే వ్యవస్థాపకులుగా మారాలని యోచిస్తున్నట్లు నివేదిక తెలిపింది. ప్రపంచ సగటు 15.7 శాతంతో ఇది దాదాపు సమానంగా ఉండటం విశేషం. గణాంకాలు ఆశాజనకంగా, దేశంలోని విద్యార్థుల మారుతున్న ఆకాంక్షలకు ప్రతీకగా ఉన్నట్లు నవంబర్ 2023 మరియు ఫిబ్రవరి 2024 మధ్య జరిపిన పరిశోధన పేర్కొంది.
అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 13 వేల 896 మంది విద్యార్థులపై ఈ సర్వే నిర్వహించబడింది. కేంద్ర నిధులతో నడపబడుతున్న సంస్థలతో పాటు రాష్ట్ర మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, అనుబంధ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కళాశాలలు మరియు ప్రైవేట్ కళాశాలలు ఇందులో పాల్గొన్నాయి.
భారతీయ విద్యార్థులలో 32.5 శాతం మంది కొత్త వ్యవస్థాపకులుగా వ్యాపారాలను ప్రారంభించడంలో చురుకుగా నిమగ్నమై ఉన్నారు. ప్రపంచ సగటు 25.7 శాతం కంటే ఇది ఎక్కువ. సర్వే ప్రకారం 49 శాతం మంది విద్యార్థులు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సులలో పాల్గొన్నారు. కాగా ఈ విషయంలో ప్రపంచ సగటు కేవలం 41.2 శాతంగా ఉంది. దేశంలోని విద్యార్థులలో వ్యవస్థాపకత విద్యకు పెరుగుతున్న ప్రజాదరణను ఈ సంఖ్య నొక్కి చెబుతోంది.












Click it and Unblock the Notifications