తెలంగాణ చేనేత, జౌళిశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ చేనేత, జౌళిశాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 30 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ ప్రకటించారు. వాటిలో క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్ 8, టెక్స్‌టైల్ డిజైనర్ ఉద్యోగాలు 22 ఉన్నట్టు వెల్లడించారు.
ఐఐహెచ్‌టీ నుంచి చేనేత టెక్నాలజీలో డిప్లొమో చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని చేనేత, జౌళిశాఖ కమిషనర్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో పాటు సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థులు తాత్కాలిక పద్ధతిన మూడేళ్లపాటు పనిచేయాల్సి ఉంటుందని శైలజారామయ్యర్ వివరించారు.

31 వరకు బదిలీల షెడ్యూల్‌పొడిగిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు
రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు జులై 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈనెల 5 నుంచి నేటి వరకు బదిలీ ప్రక్రియ జరిగేలా ముందుగా ఈనెల 3న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది.
మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియ జరగడం లేదంటూ వివిధ విభాగాల ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో బదిలీలు కొలిక్కి రాలేదు. దీంతో బదిలీల ప్రక్రియను జులై నెలాఖరు వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 1 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణరావు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications