jobs: నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో వైద్య శాఖలో 9,222 ఉద్యోగాల భర్తీ..!
ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ మంత్ర హరీష్ రావు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. వచ్చే రెండు నెలల్లో 9,222 మంది ఉద్యోగులను భర్తీ చేస్తామని చెప్పారు. ఆయన హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొత్తగా నియమితులైన 1061 మంది అసిస్టెంట్ ఫ్రొఫెసర్లకు నియామక పత్రాలను అందజేశారు.
2014 నుంచి ఆరోగ్యశాఖలో 22,263 మందిని నియమించామని తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్యను పటిష్టం చేయడంతో అందరికి వైద్యం అందించడానికి మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.
అలాగే పెరిగిన మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులకు అనుగుణంగా ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నట్లు హరీష్ రావు ప్రకటించారు. ఒకేరోజు 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించామని, వైద్య విద్యలో దేశంలోనే ఇది కొత్త రికార్డ్ అని హరీష్ రావు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టినట్లు చెప్పిన హరీశ్ రావు.. 1331 మంది ఆయుష్ కాంట్రాక్ట్ సిబ్బందిని క్రమబద్ధీకరించామని గుర్తు చేశారు.

వైద్య సేవలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని హరీష్ రావు చెప్పారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌లో ప్రస్తుతం 54 రకాల పరీక్షలు చేస్తున్నట్లు వివరించారు. జూన్ నుంచి 134 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని ప్రకటించారు. తెలంగాణలో ఒకే సంవత్సరంలో 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని.. అందుకు దాదాపు రూ.4500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
జిల్లాకో మెడికల్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. వైద్య ఆరోగ్య శాఖలో గత కొద్ది సంవత్సరాలుగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. గతేడాది 1,147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో మల్టీ జోన్-1లో 574 పోస్టులు, మల్టీ జోన్-2లో 573 ఉద్యోగాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications